కర్నూలు: హైదరాబాద్-బెంగళూరు హైవేపై జరిగిన కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ వీడినట్లు సమాచారం. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై పోలీసులు జరిపిన దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి కారకునిగా భావిస్తున్న బైకర్ శివశంకర్ తన స్నేహితునితో కలిసి ఓ పెట్రోల్ బంకులో చేసిన ‘స్టంట్స్’కు సంబంధించిన సీసీ ఫుటేజీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే బైకర్ శివశంకర్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రిస్వామిగా పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఎర్రిస్వామిని దర్యాప్తులో భాగంగా పోలీసులు భిన్నకోణాల్లో ప్రశ్నించారు. దీంతో అసలేం జరిగిందనే అంశంపై ఎర్రిస్వామి పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలుస్తోంది. బంకులో పెట్రోల్ పోయించుకున్న తర్వాత శివశంకర్ బైకు నడుపుతుండగా, స్కిడ్ కావడంతో రోడ్డుకు కుడివైపున గల డివైడర్ ను ఢీకొట్దింది. ఈ పరిణామాల్లో బైకు నడుపుతున్న శివశంకర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైకు వెనుక కూర్చున్న ఎర్రిస్వామి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇదే దశలో రోడ్డు మధ్యలో పడి ఉన్న బైకును అటువైపుగా వెడుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ఢీకొట్టిన పరిస్థితుల్లో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. బస్సు ముందు భాగంలో బైకు ఇరుక్కుపోయిన పరిస్థితుల్లో మంటలు చెలరేగడం, బైకును బస్సు ఈడ్చుకువెళ్లడంతో అగ్నికీలలు మరింత వ్యాపించి బస్సు దగ్ధమైనట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.

