తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో తీవ్ర ఘర్షణకు దారి తీసింది. మొత్తం రూ. 5.00 లక్షల నగదు సాయంతో పేదల కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాణాన్ని బట్టి దశలవారీగా లబ్ధదారులకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. లబ్ధిదారుల ఎంపికలోగాని, పథకం అమలులోగాని ఎక్కడా అవకతవకలకు ఆస్కారం ఉండరాదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదే పదే అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే పినపాక నియోజకవర్గ కేంద్రమైన మణుగూరులో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఇద్దరి వ్యక్తుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మణుగూరు ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ఓ టీ స్టాల్ ముందు ఈ ఘటన జరగడం గమనార్హం. ఇందిరమ్మ ఇల్లు కేటాయింపునకు సంబంధించి ఓ లబ్ధిదారునికి, అన్నారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత చలపతికి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ పరిణామాల్లోనే కాంగ్రెస్ నాయకుడు చలపతి లబ్ధిదారున్ని తన బూటుతో బాదుతూ బూతులంకించుకున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనే కారణంతో చలపతి అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లును కేటాయించారంటూ శ్రీను అనే వ్యక్తి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఇదే విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. తనపై అకారణంగా ఫిర్యాదు చేశాడంటూ శ్రీనుపై చలపతి దాడి చేసినట్లు భావిస్తున్న ఈ ఘటనలో పోలీసు స్టేషన్ లో ఇరువురు పరస్పరం ఫిర్యాదు కూడా చేసుకోవడం కొసమెరుపు.

