తెలంగాణా అడవుల్లో వన్యప్రాణులను వేటాడేందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వేటగాళ్లు వచ్చారు. నాటు తుపాకులు భుజాన వేసుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవుల్లో స్వైర విహారం చేస్తుండగా అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అశ్వారావుపేట మండలంలో తీవ్ర కలకలానికి దారి తీసిన ఘటన పూర్వాపరాలను అటవీ అధికారులు బుధవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు.
ఏపీలోని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామానికి చెందిన కొందరు నాటు తుపాకులు ధరించి అశ్వారావుపేట అడవులకు వన్యప్రాణులను వేటాడేందుకు వచ్చారు. బుధవారం అశ్వారావుపేట అటవీ రేంజ్ పరిధిలోని కావడిగుండ్ల సెక్షన్ ఆఫీసర్, కంట్లంకు చెందిన బీట్ ఆఫీసర్, కంట్లం బేస్ క్యాంప్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు నాటు తుపాకులతో సంచరిస్తూ కనిపించారు.

అటవీ సిబ్బంది వెంటనే వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకుని అశ్వారావుపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసుకు తీసుకువచ్చి విచారించారు. పట్టుబడిన నాటు తుపాకుల వేటగాళ్లు ఏలూరు జిల్లా కామవరానికి చెందినవారుగా గుర్తించారు. అరెస్ట్ చేసిన నిందితులు కారం రవి (26), కామ మంగబాబు (25), వంజం నవీన్ (23)లపై కేసు నమోదు చేసినట్లు అటవీ అధికారులు వెల్లడించారు. వన్యప్రాణులను వేటాడేందుకు ఈ ముగ్గురు అశ్వారావుపేట అడవులకు వచ్చినట్లు చెప్పారు. కాగా నాటు తుపాకులతో వచ్చిన వ్యక్తులను చూసి స్థానిక గిరిజనులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

