Top 5 This Week

Related Posts

ప్రణయ్ హత్యకేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు

సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ముద్దాయిలను దోషులుగా నిర్ధారిస్తూ, రెండో నిందితుడైన సుభాష్ కుమార్ కు ఉరి శిక్ష, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన ఈ హత్య కేసులో మొదటి నిందితుడు మారుతీరావు దాదాపు నాలుగేళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

తన కూతురు అమృతను కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంతో మిర్యాలగూడకు చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14వ తేదీన సుపారీ గ్యాంగుతో ప్రణయ్ ను హత్య చేయించిన ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. తన భర్త ప్రణయ్, అత్త ప్రేమలతతో కలిసి అమృత హాస్పిటల్ కు వెళ్లి, తిరిగి వస్తుండగా దారికాచిన దుండగులు ప్రణయ్ ను కత్తితో నరికి దారుణంగా హత్య చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ హత్యోదంతంలో ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

ప్రణయ్, అమృత (ఫైల్ ఫొటో)

ఇటీవలే వాద, ప్రతివాదనలు ముగిసిన ఈ కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు రెండో నిందితుడైన సుభాష్ కుమార్ కు ఉరిశిక్షను విధిస్తూ, మిగతా నిందితులైన ఏ3 అస్గర్ ఆలీకి, ఏ4 బారీకి, ఏ5 కరీంకు, ఏ6 శ్రావణ్ కుమార్ కు, ఏ7 శివకు, ఏ8 నిజాంలకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో సుభాష్ శర్మకు బెయిల్ లభించకపోవడంతో ఇప్పటికీ జైలులోనే ఉండగా, ఆస్గర్ ఆలీ మరో కేసులో జైలులో ఉన్నారు. మిగతా నిందితులు బెయిల్ పై బయటకు వచ్చారు.

Popular Articles