(By: మణిభూషణ్)
ఏదైనా ఒక రంగంలో ఎదిగినవాళ్ల గురించి “అతనికేమీ తెలీదండి, అన్నీ మనమే నేర్పించాం” అంటారు రాణింపు గుర్తింపు లేని సీనియర్లు.
గోవర్ధన్ అస్రాని దగ్గర మెళకువలు నేర్చుకున్న నటుల్లో జయ బాధురి (బచ్చన్), డానీ, శత్రుఘ్న సిన్హా తదితర టాప్ ఆర్టిస్టులున్నారు. అస్రానీ సహాధ్యాయుల్లో అదూర్ గోపాలకృష్ణన్, మణి కౌల్, సుభాష్ గాయ్ లాంటి టాప్ డైరెక్టర్లు ఉన్నారు. ‘ఏ రోజునా ఎక్కడ అస్రానీ తన గొప్పలు చెప్పుకొనేవాడు కాదంటారు’ అతనితో వర్క్ చేసినవాళ్లు.
గోవర్ధన్ అస్రానీ ‘60 దశకం తొలి రోజుల్లో నాటకాలు వేసేవారు. ముంబైలో అవకాశాల కోసం తిరుగుతున్నపుడు… హృషీకేశ్ ముఖర్జీ ‘నటన వస్తే చాలదు. సినిమాకి కావలసిన technic, professional exposure ఉండాలి. పూణేలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పెట్టారు. అక్కడ చేరమ’ని సలహా ఇచ్చారు.
పూణే ఇనిస్టిట్యూటులో first batch స్టూడెంట్లలో అస్రానీ ఒకరట! New wave director రిత్విక్ ఘటక్ అప్పట్లో ఫాకల్టీ మెంబర్. ఘటక్ దగ్గర నటనలో, దర్శకత్వంలో అస్రానీ ఆరితేరారు.
బొంబాయిలో స్టూడియోల చుట్టూ చక్కర్లు కొడుతుండగా పూణే ఇనిస్టిట్యూటులో ఫాకల్టీ అవసరమైంది. అస్రానీ ఫాకల్టీలో చేరారు. జయ, డానీ, సిన్హా తదితరులను తీర్చిదిద్దారు. ప్రతి శని ఆదివారాల్లో బొంబాయి వెళ్లి అవకాశాలకోసం ప్రయత్నాలు చేసేవారు.
అస్రానీ కామెడీ చేసేవారేగానీ, కమెడియన్ కాదు, కారెక్టర్ ఆర్టిస్ట్. హీరో స్నేహితుడు, సలహాదారు పాత్రలు ఎక్కువ వేశారు. రాజేశ్ ఖన్నాకి అస్రానీ చాలా ఇష్టం. తన సినిమాల్లో ఉండాలని పట్టుబట్టేవాడు. ఖన్నా-అస్రానీ కాంబీలో ఓ పాతిక సినిమాలుంటాయి.
అస్రానీ ఓ అర డజన్ సినిమాల వరకు డైరెక్ట్ చేశారు. వాటిలో ‘హమ్ నహీ సుధరేంగే’ ఒక్కటే చూశాను. ఇన్స్యూరెన్స్ రంగంపై సెటైరికలుగా తీశారన్నట్లు గుర్తు. కేస్టో ముఖర్జీ పాత్ర చాలా బాగుంటుంది. వీలయితే YouTubeలో చూడండి.
అస్రానీ ఎన్ని పాత్రలు వేసినా షోలేలో ‘ఇంగ్లీషోళ్ల కాలంనాటి జైలర్’ తెచ్చిన గుర్తింపు చెదరనిది.
అస్రానీ ఇకలేరు.. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలో నిన్న కన్నుమూశారు
.

