Top 5 This Week

Related Posts

పోలీసులపై దాడి కేసులో పదేళ్ల కఠిన కారాగార శిక్ష

సత్తుపల్లి: పోలీసులపై దాడి చేసి, విధులకు ఆటంకం కలిగించడం, ఇతర నేరాలకు సంబంధించిన కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 20,000 మొత్తాన్న జరిమానాగా విధిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈమేరకు సత్తుపల్లి ఆరవ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం జడ్జి ఎం. శ్రీనివాస్ తీర్పును వెలువరించారు.

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం, చిత్తాపూర్ గ్రామానికి చెందిన తిరువీధుల సురేంద్ర అలియాస్ సూర్య (36) అనే యువకుడు ఓ చోరీ కేసులో నిందితుడు. ఇతనికోసం 2025 మార్చి 10వ తేదీన సత్తుపల్లి పట్టణ పరిసరాల్లో గాలిస్తున్న పోలీసులపై సురేంద్ర ఉద్దేశపూర్వకంగా హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగానే కత్తితో దాడి చేయడం ద్వాారా సురేంద్ర పోలీసులను గాయపరిచాడు. ఈమేరకు సురేంద్ర అలియాస్ సూర్యపై
సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 126/2025 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 109, 132, 121(1) సెక్షన్ల కింద నమోదైనది.

కేసు పూర్వాపరాల విచారణ అనంతరం నిందితుడు సురేంద్రపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో అతన్ని కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 109 కింద పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10,000 వేల జరిమానా, సెక్షన్ 132 కింద రెండేళ్ల సాధారణ కారాగార శిక్షతోపాటు రూ. 5,000 జరిమానా, సెక్షన్ 121 (1) కింద ఏడాది సాధారన జైలు శిక్షతోపాటు రూ. 5,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎం. శ్రీనివాస్ తీర్పు చెప్పారు.

ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారిగా ఖమ్మం సీసీఆర్‌బీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ టి. కవిత, రెండో దర్యాప్తు అధికారిగా సత్తుపల్లి పోలీస్ స్టేషన్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్. వీరప్రసాద్ వ్యవహరించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డానియల్ ప్రాసిక్యూషన్ తరఫున న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.

కేసు విచారణ, న్యాయస్థాన ప్రక్రియలో సత్తుపల్లి ఇన్‌స్పెక్టర్ శ్రీహరి, పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది సహకరించారు. కోర్టు లైజన్ అధికారులుగా ఎస్‌ఐ కె. శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ డి. నాగేశ్వరరావు, సీడీఓగా పి.సి. వి. నరేష్, ప్రాసెస్ విధుల్లో హోంగార్డ్ జె. పర్వీన్ విధులు నిర్వహించారు. కేసు దర్యాప్తు, విచారణ ప్రక్రియలో సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

Popular Articles