Top 5 This Week

Related Posts

గ్రామీణ విలేఖరికి విగ్రహం!

అవును మీరు చదువుతున్నది నిజమే! పై ఫొటోలో గల విగ్రహం ఓ గ్రామీణ విలేఖరిదే!

ఒక గ్రామీణ విలేఖరికి స్థానిక ప్రజలు అభిమానంతో ఎనిమిదేళ్ళ క్రితం విగ్రహం ఏర్పాటు చేసిన అరుదైన ఘటన ఇది.

ఆయన పేరు ఆశపు గంగరాజు.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రముఖ పాత్రికేయుడాయన.

సుమారు యాభై సంవత్సరాల పాటు విశాలాంధ్ర విలేఖరి గా పని చేశారు.
“ఉండీల్” వార పత్రికను సుదీర్ఘ కాలంపాటు నిరాటంకంగా నిర్వహించారు.
నరసాపురం ఓ పక్క వశిష్ట గోదావరిని, మరో వైపు బంగాళాఖాతాన్ని పెనవేసుకుని ఉంటుంది.

నరసాపురం తీర ప్రాంతంలోని ప్రజా సమస్యలను విస్తృతంగా వెలుగులోకి తెచ్చిన పాత్రికేయుడు గంగ రాజే.

వ్యవసాయ, మత్స్య, గీత, చేనేత, లేసు, ఉప్పు తయారీ, నవ్వారు, కొబ్బరి పీచు, ఓ ఎన్.జి. సి వంటి రంగాల సమస్యలను, వరద, మురుగు ముంపు సమస్యలు, తీర ప్రాంత రహదారులు, వంతెనలు, విద్య, వైద్యం వంటి అంశాలపై ఆయన విస్తారంగా వార్తలు, వ్యాసాలు రాశారు.

విశాలాంధ్ర సంపాదకుడు సి.రాఘవాచారితో ఉత్తమ గ్రామీణ విలేఖరిగా ప్రశంసలు అందుకున్నారు.

స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏన్నో సత్కారాలు పొందారు.

తూర్పు గోదావరి జిల్లా కే. పెదపూడిలో చేనేత కార్మిక కుటుంబంలో 1930 లో జన్మించిన గంగరాజు నరసాపురం దత్తత వచ్చారు. బాల్యంలో ఉత్సాహంగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు.
కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశారు.

ప్రజానాట్య మండలిలో బుర్ర కథ కళా కారునిగా పేరు పొందారు.
అనంతర కాలంలో ఆయన కమ్యూనిస్టు గా మారారు.

తొలుత చేనేత కార్మికుల కోసం ఉద్యమించిన గంగరాజు అనంతరం పలు కార్మిక సంఘాల స్థాపనలో పాలు పంచుకున్నారు.

నిషేధ కాలంలో కమ్యూనిస్టు ఉద్యమంలో పలు నిర్బంధాలకు గురయ్యారు.

జైలు పాలయ్యారు.

కార్మిక నేతగా అనేక పోరాటాలు చేశారు. అరెస్టయ్యారు.

పేదలకు ఇళ్ల స్థలాల కోసం కృషి చేసి అనేక పేటలు, కాలనీల ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారు.

భూస్వాములైన మంగెన వారి కుటుంబాన్ని అభ్యర్థించి, ఒప్పించి వారిచ్చిన భూమిలో వారి పేరుతోనే పేదలకు కార్మికుల కాలనీ ఏర్పాటు చేయించారు.

ప్రముఖ కార్టూనిస్ట్ కోటి లాల్ గంగరాజు కుమారుడే. కోటిలాల్ ఆర్టీసీలో పని చేసి రిటైరయ్యారు.

వైద్య ఆరోగ్య శాఖలో సూపరింటెండెంట్ గా రిటైరయ్యి, ప్రస్తుతం ఏ.పీ. మహిళా సమాఖ్య ప.గో. జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నెక్కంటి జగదాంబ గంగరాజు కుమార్తె.

సీపీఐ రాష్ట్ర నాయకుడు నెక్కంటి సుబ్బారావు గంగ రాజు అల్లుడు.
ఆశపు గంగ రాజు 2012 ఆగస్ట్ 22న మృతి చెందారు.

ఆయనపై గల అభిమానంతో అప్పట్లోనే మంగెనవారి నగర్ లో స్థానికులు గంగరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఏటా ఆయన వర్ధంతిని అక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు.

✍️ డి.సోమ సుందర్.

Popular Articles