ఖమ్మం: ఖమ్మం జిల్లా సీపీఎం నేత సామినేని రామారావు దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సీపీఎం పార్టీ అనుబంధ రైతు సంఘం నేత కూడా అయిన రామారావు నిరుడు అక్టోబర్ 31వ తేదీన ఉదయం పాతర్లపాడు గ్రామంలో వాకింగ్ చేస్తుండగా దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.
సామినేని హత్యకు పాల్పడిన దుండగుల ఆచూకీ కోసం గడచిన ఏడాది కాలంగా ఖమ్మం జిల్లా పోలీసులు నిరంతర పరిశోధన చేస్తున్నారు. ఈమేరకు సామినేని రావును దారుణంగా హత్య చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు కొద్దిసేపటి క్రితం చింతకాని మండలం పాతర్లపాడులోనే అరెస్ట్ చేసినట్లు సమాచారం.
కాగా రామారావు హత్య కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నమాట వాస్తవమేనని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ‘సమీక్ష’ న్యూస్ తో ధ్రువీకరించారు.

