Top 5 This Week

Related Posts

‘జంతర్ మంతర్’పై ఢిల్లీ పోలీసుల నిర్ణయం చెల్లుతుందా?

‘జంతర్ మంతర్’ ప్రదేశాన్ని నిరసనల జాబితా నుండి తొలగించడం సాధ్యం కాకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం చట్టం ముందు నిలబడదు.

ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా విపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న తరుణంలో.. కేంద్ర హోంశాఖ కమిటీ సిఫార్సుల సాకుతో జంతర్ మంతర్‌ను నిరసన వేదికల జాబితా నుండి పూర్తిగా తొలగించడం (De-notify) రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలను సాకుగా చూపిస్తూ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడం కుదరదని గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు అత్యంత స్పష్టంగా నిరూపిస్తున్నాయి.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం న్యాయస్థానాల ముందు ఎందుకు వీగిపోతుందనే దానికి ఈ రెండు బలమైన చారిత్రాత్మక తీర్పులే నిదర్శనం:

సుప్రీంకోర్టు సిక్రీ ధర్మాసనం తీర్పు:
గతంలో జంతర్ మంతర్ వద్ద కాలుష్యం, శబ్ద కాలుష్యం పేరుతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నిరసనలను నిషేధించినప్పుడు, సుప్రీంకోర్టు (జస్టిస్ ఎ.కె. సిక్రీ ధర్మాసనం) ఆ ఉత్తర్వులను పూర్తిగా కొట్టివేసింది. జంతర్ మంతర్ లేదా బోట్ క్లబ్ వంటి చారిత్రాత్మక ప్రాంతాలలో ఆందోళనలను పూర్తిగా నిషేధించే హక్కు ప్రభుత్వాలకు లేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. కేవలం నిరసన సమయాలు, నిబంధనలపై సమతుల్యత (Balancing Act) సాధించాలే తప్ప, వేదికలనే రద్దు చేయలేరని స్పష్టం చేసింది.

హైదరాబాద్ ‘ధర్నా చౌక్’ హైకోర్టు తీర్పు:
ఇదే తరహాలో గతంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను ట్రాఫిక్ ఇబ్బందుల పేరుతో నగర శివార్లకు తరలించాలని చూసిన అప్పటి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని హైదరాబాద్ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. “అసమ్మతి అనేది ప్రజాస్వామ్య జీవన నాడి” అని వ్యాఖ్యానించిన హైకోర్టు, నిరసనకారులను పాలకులకు వినపడకుండా, కనపడకుండా ఎక్కడో సుదూర ప్రాంతాలకు ( తాజాగా ఢిల్లీ పోలీసులు తాజాగా నిర్ణయించిన రాంలీలా, బురారీ వంటి మైదానాలకు) తరలించడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. నిరసనలకు దృశ్యమానత (Visibility) ఉండాలని, అవి ఎల్లప్పుడూ పాలకుల అధికార కేంద్రాలకు సమీపంలోనే జరగాలని ఆదేశించింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం శాంతియుతంగా సమావేశమై నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు. పాలకులకు నిరసనల సెగ తగలకుండా ఉండేందుకు జంతర్ మంతర్ వేదికను రద్దు చేసి, ఆందోళనలను నగర శివార్లకు లేదా మైదానాలకు పరిమితం చేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణచివేయడమే. ఈ న్యాయపరమైన రక్షణల నేపథ్యంలో.. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టులను ఆశ్రయిస్తే, ఈ తాజా ఉత్తర్వులు చట్టం ముందు వీగిపోవడం, జంతర్ మంతర్ వద్ద నిరసనల హక్కు తిరిగి పునరుద్ధరించబడటం ఖాయం..!

Popular Articles