Top 5 This Week

Related Posts

ఖరీఫ్ ఎరువుల పంపిణీ సక్సెస్: మంత్రి తుమ్మల

హైదరాబాద్: ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా ముందస్తుగానే ఎరువులను పొజిషన్‌ చేయడం, షిప్‌మెంట్లను వేగంగా రాష్ట్రానికి తీసుకురావడం, ఫెర్టిలైజర్‌ యాప్‌ ద్వారా పంపిణీని పర్యవేక్షించడం వంటి చర్యలతో ఎరువుల పంపిణీని సక్రమంగా నిర్వహించామని మంత్రి పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫెర్టిలైజర్‌ యాప్‌ను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసి, ఎరువుల పంపిణీ ప్రక్రియను డిజిటల్‌ విధానంలోకి తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. ఈ విధానం ద్వారా ఎక్కడ ఎంత ఎరువుల నిల్వ ఉంది? ఎంత పరిమాణంలో బుకింగ్‌ జరిగింది? ఎంత మేరకు రైతులు ఎరువులను కొనుగోలు చేశారనే వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఏర్పడిందన్నారు.

అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యూరియా యాప్‌ను సమర్థవంతంగా అమలు చేసి, ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేయడంలో విజయం సాధించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో యూరియా పంపిణీని పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడిందన్నారు. రాష్ట్రంలో అమలు చేసిన యూరియా యాప్‌ విజయవంతమైన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేసేందుకు జాతీయ ఫెర్టిలైజర్‌ యాప్‌ను ఈ ఏడాది అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పారు.

అయితే జాతీయ ఫెర్టిలైజర్‌ యాప్‌ ప్రారంభ దశలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయని మంత్రి చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాల మ్యాపింగ్‌ పూర్తిగా అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడక్కడా ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఈ సమస్యలను పరిష్కరించే చర్యలు చేపట్టామని చెప్పారు.

మొత్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఎరువుల పంపిణీ సంతృప్తికరంగా జరిగిందని, రైతులకు అవసరమైన ఎరువులు నేరుగా, సక్రమమైన విధానంలో అందేలా యాప్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టామని తెలిపారు. భవిష్యత్తులో డిజిటల్ క్రాప్ సర్వే ఆధారంగానే పంటల కొనుగోళ్లు, యాంత్రీకరణ, సబ్సిడీపై విత్తనాల పంపిణీ వంటి అన్ని పథకాలు వర్తింప చేస్తామని మంత్రి తుమ్మల వివరించారు.

Popular Articles