కొత్తగూడెం: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సుపరిపాలనను కోల్పోయిన కారణంగానే రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయన్న భావన ప్రజల్లో రోజురోజుకు మరింతగా బలపడుతోందన్నారు. కేసీఆర్ మహానేత అని, గొప్ప పాలనాదక్షులని,ఆయన పట్ల అభిమానం రోజురోజుకు మరింత పెరుగుతున్నదన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. మంగళవారం సాయంత్రం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా కేసీఆర్ పట్ల తమలో నెలకొన్న అభిమానాన్ని భక్తులు పాటల రూపంలో ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఈ బతుకమ్మ, దసరా పండుగలప్పుడు ఇది మరోసారి వ్యక్తమవుతోందని చెప్పారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుల హామీలను నమ్మి మోసపోయినట్లు ప్రజలు భావిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన మూడేళ్లు సమీపిస్తున్నా తమకు ఒరిగిందేమీ లేదని అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు.

పట్టభద్రుల వద్దకు స్వయంగా వెళ్లి ఓటర్లుగా నమోదు చేయించే ప్రక్రియను మరింత ముమ్మరం చేయాల్సిందిగా సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేసినట్లు ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలే కాకుండా ఇక నుంచి ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమాగా చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్ రావు, తాతా మధుసూదన్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ నాయక్, నాయకులు దిండిగల రాజేందర్, ఉప్పల వెంకటరమణ, అనుగుల రాకేష్ రెడ్డి, మానే రామకృష్ణ, చాడ కిషన్ రెడ్డి, కాపు సీతామహాలక్ష్మీ, అశ్వారావుపేట, ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.

