నల్గొండ, అక్టోబర్ 14: తెలంగాణ ప్రమాణాల ప్రాధికార సంస్థ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) అధికారులు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రత్యేక తనిఖీలు (స్పెషల్ డ్రైవ్) నిర్వహించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన 10 బృందాలు, ఆహార భద్రతాధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేలోని మొత్తం 20 రెస్టారెంట్లను తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా పలు చోట్ల అపరిశుభ్ర వాతావరణం, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలను టీజీ సేఫ్ అధికారులు గుర్తించారు.
అపరిశుభ్ర వాతావరణం.. నాసిరకం ఆహారంపై అనుమానాలు:
తనిఖీల్లో భాగంగా కొన్ని హోటళ్లలో దెబ్బతిన్న ఫ్లోరింగ్, నిల్వ ఉన్న మురుగునీరు, ఆహార వ్యర్థాలు, గ్రీజుతో పేరుకుపోయిన గోడలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, చిమ్నీలు గుర్తించారు. బొద్దింకలు, ఈగల బెడద ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆహార పదార్థాలను నిల్వ చేసే రిఫ్రిజిరేటర్లను అపరిశుభ్రంగా నిర్వహించడంతోపాటు, శాఖాహార, మాంసాహార పదార్థాలను కలిపి ఉంచినట్లు గుర్తించారు. కొన్ని చోట్ల ఆహార తయారీ సిబ్బంది హెయిర్‌నెట్లు, గ్లౌజులు, అప్రాన్లు ధరించలేదని, సిబ్బంది ఆరోగ్య రికార్డులు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు వంటి తప్పనిసరి పత్రాలు కూడా లేవని గుర్తించారు. ఈ ఉల్లంఘనల నేపథ్యంలో అనుమానిత కల్తీని నిర్ధారించేందుకు మొత్తం 20 ఆహార నమూనాలను సేకరించారు.

ఏడు హోటళ్ల లైసెన్సులు సస్పెండ్:
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏడు హోటళ్లకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్సులను సస్పెండ్ చేసి, తక్షణమే వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.
ఈ జాబితాలో నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఉన్న పీపుల్ కంబైన్ హాస్పిటాలిటీ ఎల్‌ఎల్‌పీ (7 మిడ్‌వే ప్లాజా), నార్కట్‌పల్లిలోని అమ్మచేతి వంట (అంజనా టిఫిన్స్) హోటళ్లలో బొద్దింకల బెడద, అపరిశుభ్ర రిఫ్రిజిరేటర్లు, ఆహార పదార్థాల నిల్వలో లోపాలు, శుభ్రత పాటించకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించారు.

సూర్యాపేటలోని తనూజా హోటల్స్, హైవే హాస్పిటాలిటీ, శ్రీ మమత లాడ్జ్ అండ్ రెస్టారెంట్‌లలో దెబ్బతిన్న నేలలు, గ్రీజు పేరుకుపోయిన ఎగ్జాస్ట్‌లు, బొద్దింకలు, ఈగలు, కుళ్లిన కూరగాయలు, గుడ్లు, సరైన పారిశుద్ధ్య నిర్వహణ లేకపోవడం వంటి సమస్యలను గుర్తించారు. హైవే హాస్పిటాలిటీలో ముడి మాంసంతోపాటు తినదగిన మంచు ముక్కలను నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపూర్‌లోని శ్రీ ఆద్య గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్, చౌటుప్పల్ యెల్లగిరి ఎక్స్ రోడ్డులోని ఏవీఆర్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ (సంగం హోటల్)లోనూ తీవ్ర అపరిశుభ్రతను గుర్తించారు. వాడిన వంటనూనెను సరిగా నిర్వహించకపోవడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఎలుకల వ్యర్థాలు, ఫంగస్ సోకిన పదార్థాలు, శుభ్రం చేయని వంట పరికరాలు, శాఖాహార–మాంసాహార పదార్థాలను కలిపి నిల్వ ఉంచడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి.

మరో హోటల్‌లో వ్యాపార కార్యకలాపాల నిలిపివేత:
నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని హోటల్ సాయిప్రియ ఫ్యామిలీ రెస్టారెంట్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర పరిస్థితుల్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వంటగదిలో దెబ్బతిన్న నేల, నిల్వ ఉన్న నీరు, కుళ్లిన కూరగాయలు, దుర్వాసన, అపరిశుభ్ర రిఫ్రిజిరేటర్లు, రక్షణ దుస్తులు ధరించని సిబ్బంది, తప్పనిసరి రికార్డుల కొరత వంటి లోపాలు బయటపడ్డాయి. దీంతో ఆ రెస్టారెంట్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు.

ఎనిమిది సంస్థలకు మెరుగుదల నోటీసులు:
తనిఖీల్లో గుర్తించిన లోపాలను సరిచేసుకోవాలని ఎనిమిది సంస్థలకు మెరుగుదల నోటీసులు జారీ చేయనున్నారు. వీటిలో నల్గొండ జిల్లాలోని పీపుల్ కంబైన్ హాస్పిటాలిటీ ఎల్‌ఎల్‌పీ (సూర్యాపేటలోని 7 మిడ్‌వే ప్లాజా), లిటిల్ విలేజ్, వివేరా హోటల్, హోటల్ వింటేజ్ అండ్ వింటేజ్ కేఫ్, ధారసుత ఫుడ్స్; సూర్యాపేటలోని హోటల్ సాయికృష్ణ, శ్రీ తిరుమల గ్రాండ్; యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంగం హోటల్ ఉన్నాయి.
ఈ సంస్థల్లో తిరిగి తనిఖీలు నిర్వహించి, ఆహార భద్రతా నిబంధనల అమలును పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

ఐదు సంస్థలకు షోకాజ్ నోటీసులు:
తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలపై వివరణ కోరుతూ ఐదు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీటిలో నకిరేకల్‌లోని హోటల్ సాయిప్రియ ఫ్యామిలీ రెస్టారెంట్, నార్కట్‌పల్లిలోని వివేరా ప్రైవేట్ లిమిటెడ్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని విలేజ్ ఆర్గానిక్ కిచెన్, చిట్యాలలోని ఒరిస్సా ధాబా (పాతది), చిట్యాల మండలం వట్టిమర్తిలోని మినర్వా కాఫీ షాప్ అండ్ బ్లూ ఫాక్స్ రెస్టారెంట్ ఉన్నాయి. నిబంధనల ఉల్లంఘనలపై తదుపరి చర్యల్లో భాగంగా జరిమానాలు విధించే ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని సంస్థలపై తనిఖీలు కొనసాగుతాయని, ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే ఉల్లంఘనల విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని టీజీ సేఫ్ కమిషనర్ తెలిపారు. కాగా ఈ స్పెషల్ డ్రైవ్ కు సంబంధించి టీసీ సేఫ్ కమిషనర్ జారీ చేసిన ఆంగ్ల పత్రికా ప్రకటనను దిగువన యథాతథంగా చూడవచ్చు.

