Top 5 This Week

Related Posts

వెలుగుమట్లలో ‘అక్రమ మైనింగ్’పై ఖమ్మం కలెక్టర్ వార్నింగ్

ఖమ్మం: ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల ప్రాంతంలో అక్రమ మైనింగ్ నిర్వాహకులకు, మినరల్ డీలర్లకు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ వార్నింగ్ ఇచ్చారు. వెలుగుమట్ల ఏరియాలో అక్రమ మైనింగ్ ను సహించేది లేదన్నారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపి, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దివాకర టిఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఖమ్మం సమీపంలోని వెలుగుమట్ల ప్రాంతంలో అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశానుసారం రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులతో సంయుక్తంగా తనిఖీలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.

వెలుగుమట్ల పార్కు సమీపంలోని ప్రైవేట్ వెంచర్ పట్టా భూముల్లో స్థానికంగా కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా బెరైటీస్ ఖనిజాన్ని తవ్వుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. చిన్న చిన్న గుంతలు తీసి, లభించిన బోల్డర్లను పగులగొట్టి (చిప్పింగ్ చేసి) ట్రాక్టర్ల ద్వారా పక్కనే ఉన్న మినరల్ డీలర్లకు అమ్ముతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్ ప్రకటించారు.

మైనింగ్ అధికారులు, ఖమ్మం అర్బన్ మండల తహశీల్దార్ తో కలసి అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి, తవ్వకాల కొలతలను నమోదు చేసుకున్నారని చెప్పారు. ఈ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న పట్టాదారులను, బాధ్యులను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారికి నోటీసులు జారీ చేసి, భారీగా పెనాల్టీలు విధించనున్నట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఖనిజాన్ని కొనుగోలు చేసే మినరల్ డీలర్ల లైసెన్సులను కూడా రద్దు చేయడంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తన ప్రకటనలో హెచ్చరించారు

Popular Articles