(‘సమీక్ష’ న్యూస్ డెస్క్)
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం సంభవించిందా? ఈ యుద్ధంలో ఐదు లక్షల మంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటిష్ నిఘా అధికారులు ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్పై మాస్కో సాగిస్తున్న పూర్తిస్థాయి యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది రష్యన్ సైనికులు మరణించారని నిన్న బ్రిటిష్ నిఘా విభాగపు అధికారులు ప్రకటించారు.
రష్యా సైనికుల మరణాల వివరాలను యూకే సైనిక దళాల అధిపతి సర్ రిచ్ నైటన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారని అంతర్జాతీయ మీడియా సంస్థ స్కై న్యూస్ నివేదించింది. ఇంత స్వల్ప పురోగతి కోసం రష్యా అధ్యక్షుడు (వ్లాదిమిర్) పుతిన్ అక్రమ లక్ష్యానికి వ్యతిరేకంగా మానవ ప్రాణాలను ఎంత అర్థరహితంగా, నిష్ఫలంగా వృధా చేస్తున్నారో ఈ సంఖ్య స్పష్టంగా తెలియజేస్తోందని తాను భావిస్తున్నట్లు నైటన్ పేర్కొన్నట్లు ఆ సంస్థ వివరించింది.
ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యాకు జరిగిన నష్టాలలో ఎక్కువ శాతం 2023 జనవరి నుంచే సంభవించాయని నైటన్ తెలిపారు. ఆ సమయంలో రష్యా ఉక్రెయిన్ భూభాగంలో కేవలం 2% మాత్రమే స్వాధీనం చేసుకుందన్నారు. కాగా మే నెలాఖరు నాటికి యుద్ధంలో దాదాపు 5,00,000 మంది రష్యన్ సైనికులు మరణించారని ‘కొత్త నిఘా సమాచారం’ వెల్లడించిందని యూకే నిఘా, సైబర్, భద్రతా సంస్థ అధిపతి, ఆన్ కీస్ట్-బట్లర్ గతంలో చెప్పారు.
ఫిబ్రవరి 2022 నుండి రష్యన్ సైనికుల మృతులు, గాయపడినవారు, గల్లంతైనవారి సంఖ్య 1.5 మిలియన్లుగా ఉంటుందని భావిస్తున్నట్లు కైనిటన్ చెప్పారు. ఇది ఉక్రేనియన్ అంచనాలతో సరిపోలుతోంది. పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభమైనప్పటి నుండి రష్యన్ సైనికుల మృతులు, గాయపడినవారు, గల్లంతైనవారి సంఖ్య ఇప్పుడు 1.5 మిలియన్లకు పైగా ఉందని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ సెప్టెంబర్ 11న నివేదించింది. ఈ సంఖ్యలో గత ఒక్క రోజులో రష్యన్ దళాలు ఎదుర్కొన్న 1,490 మరణాలు కూడా ఉండడం గమనార్హం.
20వ శతాబ్దపు ద్వితీయార్ధం, 21వ శతాబ్దపు తొలి భాగంలో జరిగిన అన్ని యుద్ధాల్లో, సాయుధ పోరాటాలలో రష్యా, సోవియట్ దళాలు ఎదుర్కొన్న సంయుక్త నష్టాన్ని, ఉక్రెయిన్లో క్రెమ్లిన్ ఎదుర్కొన్న మొత్తం సైనిక నష్టాలు ఇప్పుడు అధిగమించాయని జనరల్ స్టాఫ్ పేర్కొంది. ఇంత భారీ సంఖ్యలో మరణాలు సంభవించడంతో ఈ యుద్ధం రష్యా ఆర్థిక భవిష్యత్తుపై ప్రభావం చూపడం ప్రారంభించిందని నైటన్ అన్నారు.
ఈ మరణాల ఫలితంగా రష్యాలో వృద్ధి మందగించడం, వినియోగదారుల డిమాండ్ బలహీనపడటం, ద్రవ్యోల్బణం అదుపు తప్పి అధిక స్థాయిలో కొనసాగడం జరిగిందని, దీనివల్ల రష్యా ఆర్థిక వ్యవస్థకు, ఆ దేశ ప్రజల శ్రేయస్సుకు, భవిష్యత్తుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని నైటన్ అన్నారు. చమురు సౌకర్యాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల పెరిగిన ద్రవ్యోల్బణ ప్రమాదాల దృష్ట్యా సెప్టెంబర్ 11న రష్యా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు కీలక వడ్డీ రేటును 14% వద్దే ఉంచాలని నిర్ణయించింది. జూన్ 2025 మధ్యకాలం తర్వాత ఈ నియంత్రణ సంస్థ వడ్డీ రేటును తగ్గించకూడదని నిర్ణయించుకోవడం ఇదే మొదటిసారి.
గత జూన్ నాటి CSIS నివేదిక ప్రకారం… ఫిబ్రవరి 2022 నుండి గత జూన్ వరకు ఉక్రెయిన్లో 5,25,000 నుండి 6,25,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు. వీరిలో 1,25,000 నుండి 1,50,000 మంది యుద్ధంలో మరణించినట్లు భావిస్తున్నారు. అదేవిధంగా రష్యాకు సాయుధ వాహనాలు, ఆయుధ సంపత్తిని, హెలీకాప్టర్లను కూడా రష్యా భారీ ఎత్తున నష్టపోయినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి. ఉక్రెయిన్ తో వార్ దెబ్బకు జరిగిన నష్టం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి కేంద్రమైన రష్యాలో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో భారత్, దక్షిణ కొరియా నుంచి ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకుంటోంది.

