Top 5 This Week

Related Posts

బెల్ట్ షాపులకు లిక్కర్ ఇవ్వొద్దు: వైన్ షాప్స్ ఓనర్లకు ఖమ్మం ఎక్సైజ్ డీసీ సంచలన ఆదేశం

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి బెల్ట్ షాపుల అంశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆయన సంచలన ఆదేశాలను జారీ చేశారు. బెల్ట్ షాపులకు వైన్ షాపుల నిర్వాహకులు లిక్కర్ ఇవ్వవద్దని ఎక్సైజ్ డీసీ ఖరాఖండిగా చెబుతున్నారు. తమ ఆదేశాలను పాటించకుంటే వైన్ షాపుల, బెల్ట్ షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తప్పవని కూడా స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థతో సోమిరెడ్డి ఈమేరకు మాట్లాడారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బెల్ట్ షాపుల అంశంలో ఎక్సైజ్ డీసీ ఓ ప్రాతిపకను అనుసరిస్తుండడం విశేషం. ఇరవై రోజుల క్రితం ఖమ్మం డివిజన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సోమిరెడ్డి గతంలో ఖమ్మం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో జిల్లాలో బెల్ట్ షాపుల దందా, గంజాయి అక్రమ రవాణా వంటి అంశాల్లో ఆయన ఫుల్ క్లారిటీగా ఉన్నట్లు తాజా ఆదేశాలను బట్టి తెలుస్తోంది.

బెల్ట్ షాపులను కట్టడి చేసేందుకు, ఇప్పటికే వాటి నిర్వాహకులైన 364 మందిని బైండోవర్ చేసినట్లు ప్రకటించారు. ఓసారి బైండోవర్ చేశాక మళ్లీ బెల్ట్ షాపును నిర్వహిస్తూ తమకు దొరికితే రూ. 2.00 లక్షల మొత్తపు ఫైన్ విధిస్తామని, జైలుకు కూడా పంపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైన్ షాపుల పక్కనే బెల్ట్ షాపుల నిర్వహణ కరెక్ట్ కాదని ఆయన అన్నారు. ముఖ్యంగా నగరాల్లో, పట్టణాల్లో, మండలాల్లో వైన్ షాపుల పక్కనే బెల్ట్ షాపులు నిర్వహించడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ తరహా బెల్ట్ షాపులు సామాన్యుడికి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయన్నారు.

బెల్ట్ షాపులు నిర్వహిస్తూ పట్టుబడినవారిని బైండోవర్ చేయడంతోపాటు వారికి కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బెల్ట్ షాపులకు లిక్కర్ ఇవ్వొద్దని వైన్ షాపుల నిర్వాహకులకు చెబుతున్నామని, ఉల్లంఘించినవారిపైనా చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఎక్కడైనా బెల్ట్ షాపులు ఉంటే ప్రజలు తమకు సమాచారం అందించాలని కోరారు. కల్తీ మద్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ అంశంలో తనిఖీలు చేస్తున్నామన్నారు.

అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో గంజాయి నియంత్రణకు కృషి చేస్తామన్నారు. ఒడిషా నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్, ముంబయి వంటి నగరాలకు అక్రమ రవాణా అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతోందన్నారు. అందుకు అనుగుణంగానే తామూ కార్యాచరణను అమలు చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి అక్రమ రవాణా, సరఫరా, బెల్ట్ షాపులకు సంబంధించి సమాజం కూడా స్పందించాలన్నారు.


Popular Articles