ఖమ్మం: తన భార్యతో చాటింగ్ చేస్తున్నాడనే అనుమానంతో ఓ గ్రామ ఉపసర్పంచ్ మరో యువకునిపై కత్తితో దాడి చేసి గాయపర్చిన ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు ఉపసర్పంచ్ గా పనిచేస్తున్న కుక్క మున్నేష్ (44) అదే గ్రామానికి చెందిన సంపటి శివ (24) పక్క పక్క ఇళ్లల్లోనే నివాసముంటుంటారు. అయితే శివ తన భార్యతో చాటింగ్ చేస్తున్నాడనే అనుమానాన్ని ఉప సర్పంచ్ మున్నేష్ పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యాహ్నం శివ తల్లంపాడు గ్రామ వద్ద ట్రాక్టర్ తో మట్టి తోలుతుండగా, మున్నేష్ అతని వద్దకు వెళ్లి తన వాహనంపై ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆరెకోడు తండావైపు తీసుకువెళ్ల శివపై మున్నేష్ కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో శివ మెడ, చేతికి గాయాలయ్యాయి. అయితే అనూహ్య ఘటనతో అప్రమత్తమైన మున్నేష్ దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న శివ 108కు కాల్ చేయగా, ఓ ప్రయివేట్ ఆసుపత్రికి చికిత్స కోసం అతన్ని తరలించారు. ఘటనానంతరం ఉప సర్పంచ్ మున్నేష్ దంపతులు గ్రామం నుంచి పరారీ అయినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

