ఖమ్మం: ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన తాజా మాజీ మున్సిపల్ కార్పొరేటర్ దోరెపల్లి శ్వేత ముఖ్య అనుచరునిగా, సన్నిహితునిగా ప్రాచుర్యం పొందిన వ్యక్తిపై మోసపు ఆరోపణలతో పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తమకు అందిన ఫిర్యాదుపై అటు బాధితులను, ఇటు ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తిని ఖమ్మం టూటౌన్ పోలీసులు స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నారు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. ఖమ్మం నగరంలోని 58వ డివిజన్ తాజా మాజీ మున్సిపల్ కార్పొరేటర్ దోరెపల్లి శ్వేతకు దేవశెట్టి సాయినాథ్ అనే వ్యక్తి ముఖ్య అనుచరునిగా, సన్నిహితునిగా పేరుగాంచాడు. అయితే సాయినాథ్ తమకు దొరన్న కాలనీలో ప్లాట్లు ఇప్పిస్తానని, దళితబంధు పథకం కింద రుణాలు, బీసీలకు లోన్లు, వికలాంగుల ఫించన్లు ఇప్పిస్తానని, ఇంటి రిజిస్ట్రేషన్ చేయిస్తానని తమవద్ద భారీ ఎత్తున డబ్బు వసూళ్లు చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మొత్తం 10 మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారమే మొత్తం రూ. 12.89 లక్షల మొత్తాలను సాయినాథ్ వసూలు చేశాడనేది ఆరోపణ. ఇందులో గరిష్టంగా రూ. 3.30 లక్షలు, కనిష్టంగా రూ. 20.000 చొప్పున తాము సాయినాథ్ కు ఇచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు. తమను మోసం చేసిన సాయినాథ్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు ఖమ్మం టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.
టూ టౌన్ సీఐ ఏమంటున్నారంటే..?
ఈ అంశంపై ఖమ్మం టూ టౌన్ సీఐ జి. రామక్రిష్ణ ‘సమీక్ష’ న్యూస్ తో మాట్లాడుతూ, ఫిర్యాదు అందినమాట వాస్తవమేనని, పూర్వాపరాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

దోరెపల్లి శ్వేత కీలక ప్రకటన:
సాయినాథ్ ప్రజలను వంచించాడనే అంశంపై 58వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ దోరెపల్లి శ్వేత ఆదివారం కీలక ప్రకటన విడుదల చేశారు. ఆయా ప్రకటన యథాతథంగా…
‘నా డివిజన్ ప్రజలకు, ఖమ్మం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
దేవశెట్టి సాయినాధ్ అనే వ్యక్తి నా పేరును ఉపయోగించుకుంటూ, నా మనిషిగా ప్రజలకు సుపరిచితుడైన విషయాన్ని ఆసరాగా చేసుకుని, డివిజన్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ప్లాట్లు ఇప్పిస్తానని, దళిత బంధు పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తానని, ఇతర పనులు చేయిస్తానని వివిధ హామీలు ఇస్తూ పలువురి నుంచి చాలా మొత్తం డబ్బులు తీసుకున్నట్లు రెండు రోజుల క్రితం ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయి.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, బాధితులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మరియు ఇక నుంచి ఇలాంటివి జరగకుండా ఉండటానికి టౌన్ ఏసీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.
ముఖ్యంగా ప్రజలకు తెలియజేయదలచుకున్నది ఏమిటంటే, నా పేరును ఉపయోగించుకుని ఎవరైనా చేసే వ్యక్తిగత వ్యవహారాలకు, ఆర్థిక లావాదేవీలకు నేను బాధ్యత వహించను. నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగినా, హామీలు ఇచ్చినా వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
డివిజన్లో నా పేరును ఉపయోగించుకుని ఇలాంటి వ్యవహారాల వల్ల ఎవరైనా నష్టపోయి ఉంటే, వారు ఎవరైనా సరే భయపడకుండా ముందుకు వచ్చి తగిన ఆధారాలతో సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసి న్యాయ పరంగా ముందుకు వెళ్లాలని కోరుతున్నాను. బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన పరిధిలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను.
ప్రజల నమ్మకమే నాకు ముఖ్యం. నా పేరును దుర్వినియోగం చేసే ఎలాంటి వారిని అయినా ఉపేక్షించకుండా, సంబంధిత అధికారుల ద్వారా చట్టబద్ధమైన చర్యలు తీసుకునేందుకు సహకరిస్తాను’ అని దోరెపల్లి శ్వేత తన ప్రకటనలో పేర్కొన్నారు.

