Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

అదే పరిష్కారమైతే.. ఈ ప్రపంచం ఎప్పుడో స్మశానంగా మారిపోయి ఉండేది తల్లీ..!

తెలుసుండాలి

జీవితం
మహా సముద్రం….
ఇక్కడ దుఃఖం
కాలువలుగా
నదులుగా
నిరంతరం పొంగుతుంటుంది…!
ఎదురీదడం తెలుసుండాలి…!!

జీవితం
కాలం చెక్కే శిల్పం….
ఇక్కడ గాయం
గుండెలను తూట్లు పొడుస్తూ
నిరవధికంగా విస్తరిస్తుంటుంది..!
పడిపోవడం కాదు,
నిలదొక్కుకోవడం తెలుసుండాలి..!!

జీవితం
కాల కూట విషం…
ఇక్కడ వ్యధ
అణువణువును ఆక్రమిస్తూ
అతలాకుతలం చేస్తుంటుంది…!
నిస్సహాయంగా స్వీకరించడం కాదు,
అమృతానికై మధించడం తెలుసుండాలి…!!

జీవితం
చావు అగ్రిమెంట్ మీద సంతకం…
ఇక్కడ ఆశ
క్షణ క్షణం భంగపడుతూ
అడుగడుగున రెక్కలు తెచ్చుకుంటుంది…!
గమ్యం ఆత్మహత్య కాదు,
చివరి మలుపు వరకు పయనించడం తెలుసుండాలి…!!

(ఒక కవి అన్నట్టు.. ప్రతి సమస్యకు చావు పరిష్కారం అయితే ఈ ప్రపంచం ఎప్పుడో స్మశానంగా మారిపోయి ఉండేది. నిజమే కదా! చర్లపల్లి రైల్వే స్టేసన్ సమీపాన తల్లీ, పిల్లలు సహా ముగ్గురి ఆత్మహత్యకు స్పందిస్తూ….)

Popular Articles