నక్సల్స్ తో శాంతి చర్చల అంశంలో ప్రభుత్వ వైఖరిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుండబద్దలు కొట్టినట్లే కనిపిస్తోంది. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని, ప్రభుత్వానికి సాయధ మావోయిస్టులు లొంగిపోవలసిందేని ఆయన తేల్చి చెప్పారు. ఆయుధాలు చేబూనిన నక్సలైట్లతో కొత్తగా చర్చించేది ఏముంటుందని కూడా ఆయన ప్రశ్నించారు. అడవుల్లో అశాంతిని రగిలిస్తే, హింసకు పాల్పడితే ప్రభుత్వ బలగాలు చూస్తూ ఊర్కోవని, తగిన గుణపాఠం చెబుతాయని కూడా అమిత్ షా మరోసారి హెచ్చరించారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోయే నక్సలైట్లను స్వాగతిస్తామని, వారికి పునరావాసం కల్పిస్తామని కూడా కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. వచ్చే మార్చి నెలాఖరులోపు నక్సలిజాన్ని తుదముట్టిస్తామని, తీవ్రవాదరహిత దేశంగా మారుస్తామని కూడా ఆయన పునరుద్ఘాటించారు. బస్తర్ దసరా ఉత్సవాల్లో పాల్గోనేందుకు ఛత్తీస్ గఢ్ లో పర్యటించిన అమిత్ షా జగదల్ పూర్ లో నిన్న జరిగిన కార్యక్రమంలో ఇదే సారాంశంతో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
నక్సలిజంపై తాము ఎంచుకున్న లక్ష్యమేంటో అమిత్ షా ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. శాంతిచర్చలను కోరుకునేవారి డిమాండ్ పైనా ఆయన ఈ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తంగా జగదల్ పూర్ వేదికగా నక్సల్స్ అంశంలో కేంద్ర హోం మంత్రి చేసిన ఆయా వ్యాఖ్యల నేపథ్యంలో అడవుల్లో మిగిలి ఉన్న మావోయిస్టుల తదుపరి అడుగులపైనే విప్లవ కార్యకలాపాల పరిశీలకుల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆయుధాలు వదిలేసే అంశంపై మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతల మధ్య ఏర్పడిన భిన్నాభిప్రాయాల నేపథ్యం కూడా ఈ చర్చకు ఆస్కారం కలిగించింది.
ఆయుధాలు వదిలేసే అంశంలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ విడుదల చేసిన ప్రకటన, ఆ తర్వాత పార్టీ తెలంగాణా రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ కౌంటర్ గా మరో ప్రకటన విడుదల చేసిన పరిణామాలు తెలిసిందే. జగన్ ప్రకటన తర్వాత అభయ్ సైతం ఇంకో ప్రకటన విడుదల చేశారు. ఈ పరిస్థితుల్లోనే అభయ్ ‘ఆయుధాల వదిలేస్తాం’ ప్రకటనకు పార్టీలో కొంత మద్ధతు లభిస్తున్నట్లు తాజా సమాచారం. అభయ్ చేసిన ప్రకటనకు నార్త్ బస్తర్ డివిజనల్ కమిటీ మద్ధతునిచ్చింది. సాయుధ పోరాటాన్ని త్యజించాలనే నిర్ణయానికి తాము మద్ధతునిస్తున్నట్లు నార్త్ బస్తర్ డివిజనల్ కమిటీ ప్రతినిధి సుఖ్ దేవ్ ఖౌడో పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటన తర్వాత గడ్చిరోలి డివిజన్ కమిటీ సైతం అభయ్ కు అండగా నిలిచినట్లు మరో ప్రకటన విడుదల కావడం గమనార్హం. ఈ కమిటీ సాంకేతిక విభాగానికి బాధ్యత వహించే మైన్, 10 కంపెనీ కమాండర్ నిఖిల్, గడ్చిరోలి డివిజన్ కమిటీకి చెందిన ప్రవక్తల పేర్లతో సంయుక్త ప్రకటన వెలువడింది.
ఈ పరిస్థితుల్లో దండకారణ్యంలోని మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతల మధ్య మాత్రమే కాదు, వివిధ కమిటీల మధ్య కూడా భిన్నాభిప్రాయాలున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో ఆయుధాలు వదిలేసే ప్రసక్తే లేదని పేర్కొంటున్న కమిటీలు, ఆయుధాలు త్యజించాలనే నిర్ణయానికి వచ్చిన అభయ్, అతనికి మద్ధతుగా నిలిచిన ఉత్తర బస్తర్, గడ్చిరోలి డివిజనల్ కమిటీలకు చెందిన మావోయిస్టు నేతల పయనమెటు? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ‘సమీక్ష’ ఇప్పటికే ప్రచురించిన కథనం ప్రకారం.. ఆయుధాలు వదిలేయాలనే నిర్ణయంతో గల అభయ్ ముందున్న ఆప్షన్లు రెండే రెండు. ఒకటి ప్రభుత్వానికి లొంగిపోవడం, లేదంటే తనకు మద్దతుగా నిలిచిన సహచరులతో కలిసి పార్టీని చీల్చి మరో విప్లవ సంస్థను ఏర్పాటు చేయడం మినహా అభయ్ కు గత్యంతరం లేదనే వాదనలు కూడా విప్లవ కార్యకలాపాల పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ తోపాటు ఇంకో కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ తక్కళ్లపల్లి వాసుదేవరావు సైతం లొంగుబాటలో పయనిస్తున్నారనే వార్తలు వచ్చాయి. మల్లోజుల ఇప్పటికే పోలీసుల నియంత్రణలో ఉన్నారనే ప్రచారాన్ని తెలంగాణాకు చెందిన పోలీసు వర్గాలు తోసిపుచ్చాయి. అంతేకాదు, ఆశన్న లొంగుబాటు నిజమే అయితే అందుకు కారణాలు వేరే ఉన్నాయని, తన సతీమణి ఇప్పటికే లొంగిపోవడం, అనారోగ్య అంశాలు మినహా అభయ్ తో కలిసి ఆశన్న లొంగిపోతున్నారనే వాదనలో నిజం లేదనే ప్రచారం మరోవైపు సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీ మాజీ నేత జంపన్న తన ఫేస్ బుక్ వాల్ పై ఏమంటారంటే.. ‘‘ఆయుధ విసర్జన ఎజెండాలో చర్చిద్దామని అమరుడైన జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావు ఏప్రిల్ నెలలో చేసిన ప్రకటనకు పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ సాయుధ పోరాట విరమణ ప్రకటనకు తేడా ఏమీ లేదు. ఆయుధ విసర్జన లేదా సాయుధ పోరాట విరమణ కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిగి అక్కడ ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు జరిగినప్పుడే అమలులోకి వస్తుంది. నంబల కేశవరావు ప్రకటించిన విధానాన్నే అభయ్ ప్రకటించాడు. అప్పుడైనా, ఇప్పుడైనా చర్చించవలసిన విషయం ఆయుధ విసర్జన లేదా సాయుధ పోరాట విరమణ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయా? లేదా? అనే విషయం చుట్టూతా చర్చిస్తే సమాజానికి, మావోయిస్టు పార్టీకి ఉపయోగపడుతుంది. ఈ చర్చను వదిలేసి ఆ ప్రకటనలు బూటకమైనవని , లేదా సరెండర్ అవుతున్నారని లేదా కోవర్ట్ అని గాలి చర్చలు చేయడంవల్ల ఉపయోగం కంటే నష్టం ఎక్కువ. సెప్టెంబర్ 16వ తేదీన అభయ్ ప్రకటన చేసినప్పటి నుండి రాజకీయ విధానంపై చర్చ చేయకుండా ఊహాగానాలపై అల్ప విషయాలపై చర్చించడం ద్వారా ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. సమాజ అభివృద్ధి గురించి ఆలోచించే విశ్లేషకులు మేధావులు స్పష్టంగా ధైర్యంగా తమ విశ్లేషణలు చేయవలసిన అవసరం ఉన్నది.’’
మొత్తంగా జగదల్ పూర్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీ భవితవ్యం, ఆయుధాలు వదిలేయాలనే అభయ్ ప్రకటన, అందుకు మద్దతునిస్తున్న కమిటీల తదుపరి అడుగుల పరిణామాలపై విప్లవోద్యమాభిమానుల్లో భిన్న చర్చ జరుగుతోంది.