బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఈనెల 16న ఉదయం 10 గంటలకు తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరుతూ ఏసీబీ ఈ నోటీసులను జారీ చేసింది. వాస్తవానికి ఈ ఈ అంశంలో గత నెల 26న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు జారీ చేయగా, విదేశీ పర్యటన వల్ల రాలేకపోతున్నానని, తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ మరోసారి శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
తనకు ఏసీబీ మళ్లీ నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ స్పందించారు. ఏసీబీ విచారణకు సహకరిస్తానని, బాధ్యత గల పౌరునిగా విచారణకు హాజరవుతానని వెల్లడించారు. ఇదే దశలో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. పదే పదే విచారణలతో ప్రజాధనం వృధా ఎందుకని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ ను ఏసీబీ విచారిస్తున్నదని, లై డిటెక్టర్ పరీక్షలకు తాను సిద్ధమని, రేవంత్ సిద్ధమేనా? అని ప్రశ్నించారు.

కాగా కేటీఆర్ కు ఏసీబీ మళ్లీ నోటీసులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. రాజకీయ కక్షలో భాగంగా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని, ఎన్ని కుట్రలు చేసినా ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఇదే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ, దర్యాప్తు సంస్థలను సీఎం రేవంత్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఫార్ములా ఈ రేసింగ్ తో తెలంగాణ ప్రతిష్ట పెరిగిందని, పెట్టుబడులు కూడా వచ్చాయని, తెలంగాణ ప్రతిష్ట పెంచినందుకా కేటీఆర్‌పై మీ నోటిసుల ప్రతాపం..? అని హరీష్ వ్యాఖ్యానించారు.