Top 5 This Week

Related Posts

ఖమ్మంలో ఇద్దరు దొంగల అరెస్ట్: రూ. 16.00 లక్షల సొత్తు స్వాధీనం

ఖమ్మం నగర పోలీసులు సోమవారం ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వీరివద్ద నుంచి రూ. 16.00 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం సిటీ ఏసీపీ రమణమూర్తి మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఖమ్మంలోని ముస్తఫానగర్ కు చెందిన చల్లా వెంకటేశ్వర్లు, భద్రాచలంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన దేవనబోయిన మహేష్ అలియాస్ బాతు అనే వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతుంటారు. గత మే 14వ తేదీన ఖమ్మం బైపాస్ రోడ్ లో చైన్ స్నాచింగ్, మార్చి 12వ తేదీన రోటరీ నగర్ లో ఇంటి తాళం పగులగొట్టి చోరీ, గత ఏప్రిల్ 8వ తేదీన మామిళ్లగూడెంలో మహిళ మెడలో గల చైన్ స్నాచింగ్, గత జూలై 4వ తేదీన బ్యాంకు కాలనీలో ఇంటి తాళం పగులగొట్టి చోరీ, అదే నెల 27వ తేదీన సహకార నగర్ లోని ఇంట్లో చోరీ, గత ఫిబ్రవరి 8వ తేదీన సంభాని నగర్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం, గత మే 3వ తేదీన సంభాని నగర్ లోనే మరో ఇంటలో వీరిద్దరూ దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరి నేర చరిత్రలో ఇవి ముఖ్యమైన ఘటనలుకాగా, వీటితోపాటు పోలీస్ స్టేషన్ల వారీగా ఖమ్మం -1 టౌన్ పరిధిలో ఐదు, అర్బన్ పరిధిలో నాలుగు, రూరల్ పరిధిలో రెండు, బోనకల్ లో రెండు, కామేపల్లి, వేంసూరు, ఏన్కూరు, సత్తుపల్లి, కొత్తగూడెం-3 టౌన్ పరిధిల్లో మొత్తం 26 చోరీలకు పాల్పడ్డారు.

ఈ ఇద్దరు దొంగలు సోమవారం అనూహ్యంగా పోలీసులకు పట్టుబడినట్లు ఏసీపీ చెప్పారు. టూ టౌన్ సీఐ బాలక్రిష్ణ తన సిబ్బందితో కొత్త బస్ స్టేషన్ వెనుకవైపున ఎన్ఎస్టీ రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తుండగా బైకుపై వెడుతూ, పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారని ఏసీపీ రమణ మూర్తి పేర్కొన్నారు. అయితే అనుమానంతో పోలీసులు వారిని పట్టుకుని, వారివద్ద గల బ్యాగును తనఖీ చేయగా దొంగిలించిన బంగారు, వెండి వస్తువులతో పట్టుబడినట్లు చెప్పారు.

చోరీ సొత్తును పరిశీలిస్తున్న ఏసీపీ రమణమూర్తి తదితర అధికారులు

పట్టుబడిన దొంగల నుంచి 45 గ్రాముల బంగారు నాన్ తాళ్లు, 22 గ్రాముల బంగారు గాజులు, 40 గ్రాముల బంగారు చెయిన్లు, రింగులు, 22 గ్రాముల నాలుగు జతల చెవి దుద్దులు, అరకిలో వెండి ప్లేటు, రెండు మోటార్ సైకిళ్లు, ఒక స్కూటీ, కలర్ టీవ తదితర సామాగ్రి సహా మొత్తం రూ. 16.00 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రమణ మూర్తి మీడియా సమావేశంలో వివరించారు. వరుస చోరీలకు పాల్పడుతున్న ఈ ఇద్దరు దొంగలను చాకచక్యంగా పట్టుకున్న సీఐ బాలక్రిష్ణను, ఇతర పోలీసు సిబ్బందిని ఏసీపీ రమణమూర్తి అభినందించారు. మీడియా సమావేశంలో సీసీఎస్ ఏసీపీ సర్వర్ తదితరు పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.

దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు

Popular Articles