సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి జింకలపార్కు ‘వేటగాడు’ అరెస్టయ్యాడు. సత్తుపల్లి పట్టణంలోని నీలాద్రి అర్బన్ పార్కులో దుప్పుల వేటకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కుంటున్న అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు సోదరుడు మెచ్చా రంగారావు కుమారుడు రఘును సత్తుపల్లి ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. రఘుతోపాటు మరో నిందితుడు కుంజా రఘును కూడా అరెస్ట్ చేశారు. దుప్పుల వేట కేసులో ఈ ఇద్దరు నిందితులకు సత్తుపల్లి కోర్టు ఈనెల 16వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
ఇదీ చదవండి: (గురువారం ‘సమీక్ష’ ప్రచురించిన ప్రత్యేక కథనం)

సత్తుపల్లి-వేంసూరు మార్గంలోని జింకల పార్కులో మెచ్చా రఘు దుప్పులను వేటాడి తన ఆప్తులకు ‘విందు’ ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే విచారణ జరిపిన అటవీ అధికారులు అనుమానితులుగా పంతంగి గోపీకృష్ణ, సొంటి రాంప్రసాద్ అనే వ్యక్తులను ఇటీవల అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో కీలక నిందితునిగా భావించిన మెచ్చా రఘుతోపాటు కుంజా భరత్ అనే మరో వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులపై తెలంగాణా అటవీ చట్టం-1967, వన్యప్రాణి సంరక్షణ చట్టం – 1972 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు అటవీ అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ, అక్రమ వేట, అడవి జంతువులను చంపడం, అటవీ వనరులను నాశనం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఇటువంటి వ్యవహారాలపై అటవీ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. అటవీ ప్రాంతాల్లో ఇలాంటి అనుమానాస్పద, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు కనిపించినా, సమాచారం తెలిసినా వెంటనే అటవీ శాఖకు తెలియజేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

