హైదరాబాద్: మేడారం సమ్మక్క-సారలమ్మ భక్తులకు శుభవార్త. ఈనెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం మహాజాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు ‘టోల్ ఫ్రీ’ అవకాశాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో సూత్రప్రాయంగా వెల్లడించారు. మేడారం వెళ్లే భక్తులకు టోల్ రుసుము మినహాయంపు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, భక్తులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆయన ప్రకటించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై గల పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద ‘టోల్ ఫ్రీ’ సదుపాయాన్ని కల్పించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఎక్కువగా ఆంధ్రా ప్రజలకు ఉపకరించే ఈ యోచనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ‘మేడారం భక్తులు ఏం పాపం చేశారు మంత్రిగారూ!’ శీర్షికన ‘సమీక్ష’ న్యూస్ వెబ్ సైట్ ఈనెల 1వ తేదీన ఓ వార్తా కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.
కాగా మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, మేడారం భక్తులకు టోల్ ఫ్రీ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రకటించడం విశేషం. ‘సమీక్ష’ ప్రచురించిన ఆయా వార్తా కథనాన్ని దిగువన చదవవచ్చు..

