రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్కను ఉటంకిస్తూ మావోయిస్టు పార్టీ తెలంగాణా రాష్ట్ర కమిటీ పేరుతో విడుదలైన లేఖ తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ లేఖపై మంత్రి సీతక్క సైతం స్పందిస్తూ మీడియాతో మాట్లాడడం గమనార్హం. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ మంత్రి సీతక్కను ఉద్ధేశిస్తూ చేసిన వ్యాఖ్యలేమిటి? ఆమెను నేరుగా మావోయిస్ట్ పార్టీ హెచ్చరించిందా? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా రేకెత్తుతున్నాయి.
మావోయిస్టు పార్టీ తెలంగాణా రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి పేరుతో విడుదలైన లేఖలో జీవో నెం. 49ను ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం. ఈ జీవో పులుల కోసమా? మావన పులుల కోసమా? అనే శీర్షికతో మావోయిస్ట్ పార్టీ ఆ లేఖను విడుదల చేసింది. టైగర్ ఫారెస్ట్ కారిడార్ పేరుతో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని వివిధ మండలాల ప్రజలను ఖారీ చేయాలని ఒత్తిడి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని ఆ లేఖలో మావోయిస్ట్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేసింది.ఈ లేఖలోనే మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని పరిస్థితులను మావోయిస్ట్ పార్టీ ప్రస్తావించింది.

తన లేఖలో సీతక్క గురించి మావోయిస్టు పార్టీ ఏమన్నదంటే..:
‘‘ములుగు జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలను అరెస్టులతో, కేసుల బెదిరింపులతో గూడేలను ఖాళీ చేయించడానికి రాజ్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఆదివాసీ బిడ్డ, మాజీ నక్సలైట్ గా ప్రాచుర్యంలో ఉన్న సీతక్క సొంత నియోజకవర్గంలో ఈ విధంగా జరగడం సిగ్గుచేటు, అవమానకరం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ధనసరి అనసూయగారు ఎందుకు ఆదివాసీల గురించి మాట్లాడడం లేదు అనేది అందరూ అనుకుంటున్నారు. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గురించి, 1996లో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి పెసా చట్టం గురించి, 2006లో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఎఫ్ఆర్ఏగాని, 1/70 చట్టం గురించి సీతక్క మరచిపోయిందా? రాహుల్ గాంధీ ఆదివాసీల గురించి, భారత రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడుతున్నది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదా? తెలంగాణా రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నది.’’ అని జగన్ పేరుతో విడుదలైన లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది.

మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖపై మంత్రి సీతక్క కూడా స్పందించారు. ఈమేరకు ఏటూరునాగారంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సీతక్క ఏమన్నారంటే..:
ఆ లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు. అయితే లేఖలో లేని అంశాలపై ఒక రాజకీయ పార్టీ పత్రికలు, మీడియా సంస్థలు సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. మహిళ అని చూడకుండా అసభ్య పదజాలాన్ని వాడుతూ తమ రాజకీయ కక్షను తీర్చుకుంటున్నాయి. మహిళపై అసభ్య పదజాలాన్ని వినియోగించడం ఆవేదన కలిగిస్తోంది. ఒక మహిళను పట్టుకుని సిగ్గులేదా? అని రాయడం ఏం జర్నలిజం? నేను ఎన్నడూ ప్రజలకు దూరంగా లేను. వారంలో రెండు మూడు రోజులు ములుగు, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. నన్ను ఎన్నికల్లో ఓడించాలని ఎన్నో శక్తులు పని చేశాయి. అవే శక్తులు ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నాయి. ఒక కోయ మహిళలకు జనరల్ పోర్ట్ ఫోలియో దక్కడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. గడచిన 75 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఒక కోయ మహిళకు జనరల్ పదవి వస్తే సహించలేకపోతున్నారు. నా వ్యక్తి గత ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారు. జీవో 49తో అడవి బిడ్డలు నష్టపోతారని ఆ జీవోను వ్యతిరేకించాను. మా జీవితాలకు గొడ్డలి పెట్టులాంటి జీవోను రద్దు చేయాలని కోరాను. గిరిజన సంక్షేమ మంత్రిని కాకున్నా, పార్టీలకతీతంగా ఎస్టీ ఎమ్మెల్యేలందరితో సమావేశమై జీవో 49ను రద్దు చేయాలని తీర్మాణించాం. ఏ హోదాలో, ఏ స్థాయిలో ఉన్నా నేను ఆదివాసీ అడవి బిడ్డనే. వారి సంక్షేమం, అభివృద్ది కోసమే నా జీవితం అంకితం. ఆదివాసీలు, అణగారిన వర్గాల కోసం విపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేశాను. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసులకు మేలు చేసేలా అధికారాన్ని వినియోగిస్తున్నాను. అడవి బిడ్డల పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నాం. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఘటనలు మా దృష్టి రాగానే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో, సీసీఎఫ్ సువర్ణతో స్వయంగా మాట్లాడాను. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు జరగకుండా చర్యలు చేపడుతామని వారు హమీ ఇచ్చారు.ప్రతిపక్షంలోనైనా, అధికార పక్షంలోనైనా నాదొక్కటే నినాదం. కొత్త అడవి కొట్టొద్దు.. పాత అడవిని వదిలిపెట్టొద్దు.. అన్నదే నా విధానం. అప్పుడైనా, ఇప్పుడైనా అదే నా పోరాటం’’ అని మంత్రి సీతక్క అన్నారు.
మొత్తంగా జీవో నెం. 49 విడుదలైన నేపథ్యంలో అటు మావోయిస్టు పార్టీ లేఖ, ఇటు మంత్రి సీతక్క స్పందన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.