ఖమ్మం: రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తున్నదని తెలంగాణా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం యం. వెంకటాయపాలెం గ్రామంలో రూ. 15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 9 వేల 700 మెట్రిక్ టన్నుల సామర్థ్యపు కోల్డ్ స్టోరీజీల నిర్మాణానికి ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 10 సంవత్సరాల కాలంలో గత పాలకులు గిడ్డంగుల సామర్థ్యం 3 లక్షల మెట్రిక్ టన్నుల పెంచితే, తమ ప్రజా ప్రభుత్వం 5 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణ పనులు చేపట్టిందని, రాబోయే 3 సంవత్సరాలలో వీటిని పూర్తి చేస్తామన్నారు. గిడ్డంగుల సంస్థ ద్వారా గతంలో ఎన్నడు లేని విధంగా మొట్టమొదటిసారిగా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, 9,700 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్ ను 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామన్నారు. సంవత్సర కాలంలో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం పూర్తి చేసి, వాణిజ్య పంటలు పండించే రైతన్నలకు ప్రైవేటు కంటే అతి చౌకగా కోల్డ్ స్టోరేజ్ అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు.

రైతులను రాజు చేయడమే లక్ష్యంగా నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల యూరియా సమస్య ఏర్పడితే ఢిల్లీలో రైతుల పక్షాన పోరాటం చేసి రైతులకు యూరియా సరఫరా చేశామన్నారు. రాబోయే వారం రోజులలో యూరియా సమస్య పరిష్కారం అవుతుందన్నారు. గత పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో పేదలను మోసం చేస్తే ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసిందన్నారు. మిగిలిన అర్హులకు కూడా తదుపరి విడతల్లో తప్పని సరిగా ఇండ్లు మంజూరు చేస్తామని, మరో 3 సార్లు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిధులు బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నామని అన్నారు. అర్హులైన నిరు పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని మంత్రి అన్నారు.

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మంత్రి: పేదల ఆత్మగౌరవానికి చిహ్నంగా రాష్ట్ర ప్రభుత్వంచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించి పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆరెంపుల గ్రామంలో నిర్మించి పూర్తి చేసిన జెల్ల విజయ కుమారి, చెన్నబోయిన నరేష్, షేక్ నాగుల్ పాషా, చిర్ర రాజ్యం, సమర్థపు మమత, షేక్ రంజాన్ పాషా లకు చెందిన ఇందిరమ్మ ఇళ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు చిర్ర రాజ్యం ఇంట్లో మంత్రితోపాటు, కలెక్టర్ అనుదీప్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లు భోజనం చేశారు.

