హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా తెలంగాణా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయుధ పూజ చేశారు. అయితే మంత్రి పొంగులేటి దసరా సందర్భంగా తుపాకులకు ఆయుధపూజ చేయడమే అసలు విశేషం. దసరా ఉత్సవాల్లో ఆయుధ పూజ విశిష్ట ప్రాధాన్యతను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. దసరా నవరాత్రి పండుగలో తొమ్మిదవ రోజున (మహా నవమి) జరుపుకునే పండుగే ఆయుధ పూజ. పురాణ గాథల ప్రకారం.. దుర్గాదేవి మహిషాసురునిపై సాధించిన విజయానికి, శ్రీరాముడు లంకను జయించినందుకు గుర్తుగా, పాండవులు తమ వనవాసంలో దాచిన ఆయుధాలను బయటకు తీసి నిర్వహించిన పూజ తదితర కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
ఆయుధ పూజలో ప్రధానంగా సరస్వతి, లక్ష్మి, పార్వతీ దేవతలను పూజిస్తుంటారు.శాస్త్ర ప్రకారం ‘కత్తి’కి ఆయుధ పూజ చేయాలనేది కొందరు పురోహితుల అభిప్రాయం. శక్తిస్వరూపిణి అమ్మవారి ఆయుధం పిడితో గల కత్తి (బాకు)గా చెబుతుంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో త్రిశూలానికి ఆయుధ పూజ నిర్వహిస్తుంటారు.
ఈ ఆయుధ పూజలో ఎవరి వృత్తులకు సంబంధించిన వస్తువులను వారు పూజిస్తుంటారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనిముట్లకు, సైనికులు, పోలీసులు తుపాకులకు, విద్యార్థులైతే పుస్తకాలకు, పెన్నులకు, జర్నలిస్టులు కూడా పెన్నులకు, సంగీత కళాకారులు వాయిద్యాల వంటి వస్తువులకు ఆయుధపూజ చేస్తుంటారు. చేతివృత్తులు, చేసే వృత్తుల వారీగా ఆయుధ పూజలో వాడే వస్తువులు మారవచ్చు. సమకాలీన జీవనంలో ప్రస్తుతం కంప్యూటర్లకు, లాప్ ట్యాప్ లకు కూడా ఆయుధ పూజ చేస్తున్నారనేది తెలిసిందే. రాజకీయ రంగం విషయానికి వస్తే హోం మంత్రిత్వ శాఖను నిర్వహించే నాయకులు తుపాకులకు నిర్వహించే ఆయుధ పూజలో పాల్గొన్న ఉదంతాలు ఉన్నాయి.
ఇటువంటి ఆయుధపూజ విశిష్టతలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈసారి తుపాకులకు ఆయుధ పూజ నిర్వహించడం ఆయన అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. తన రక్షణకు నియమించిన గన్ మెన్ల వద్ద గల ఆయుధాలకు మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించినట్లున్నారు. తమ అభిమాన నాయకుడు ఆయుధ పూజకు ఈసారి తుపాకులను ఎంచుకోవడంపై పొంగులేటి అభిమానులు తెగ సంబరపడిపోతుండడం మరో విశేషం.

విజయదశమి సందర్బంగా బుధవారం హైదరాబాద్ లోని తన నివాసంలో మంత్రి పొంగులేటి కుటుంబ సమేతంగా ఆయుధ పూజ నిర్వహించారు. దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా విరాజిల్లుతూ, అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతున్నట్ల మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా చెప్పారు.