‘సమీక్ష’ న్యూస్ అంచనా తప్పలేదు. వార్తా కథనంలో ప్రస్తావించిందే జరిగింది.. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ప్రభుత్వానికి లొంగిపోయారు. తానొక్కడే కాదు 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర పోలీసులకు మంగళవారం లొంగిపోయారు. ఈ అరవై మందిలో ఎంత మంది కీలక నేతలున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. దాదాపు పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు (డీవీఎంలు) ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆయుధాలు వదిలేస్తాం’ అంటూ మల్లోజుల చేసిన ప్రకటన మావోయిస్ట్ పార్టీలో తీవ్ర కలకలాన్ని రేపింది. అది మల్లోజుల వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీ నిర్ణయం కాదని తెలంగాణా రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ కౌంటర్ ప్రకటన జారీ చేశారు. తన వద్దగల తుపాకులు పార్టీకి అప్పగించాలని, లేనిపక్షంలో పీఎల్జీఏ (పీపుల్స్ గెరిల్లా ఆర్మీ) స్వాధీనం చేసుకుంటుందని జగన్ హెచ్చరించారు. అనంతరం మల్లోజుల పేరుతో మరికొన్ని వరుస ప్రకటనలు కూడా విడుదలయ్యాయి.
ఈ నేపథ్యంలో మల్లోజుల ముందున్న ‘ఆప్షన్ల’పై గత నెల 28వ తేదీన ‘సమీక్ష’ సవివర కథనాన్ని ప్రచురించింది. దశాబ్ధాలపాటు పార్టీకి తన జీవితాన్ని అంకితం చేసిన మల్లోజుల వద్దగల తుపాకులను స్వాధీనం చేసుకునే పరిస్థితి ఏర్పడిన పరిణామాల్లో ఆయన ముందున్న మార్గాలపై ‘సమీక్ష’ వార్తా కథనాన్ని ప్రచురించింది. సమీక్ష పేర్కొన్న రెండు మార్గాల్లోని ఓ దారిని మల్లోజుల ఎంచుకోవడం గమనార్హం. సమీక్ష సెప్టెంబర్ 28వ తేదీన ప్రచురించిన వార్తా కథనాన్ని దిగువన చూడవచ్చు..