(సమీక్ష ప్రత్యేక కథనం)
‘‘గోల్డ్ పర్చేస్ అడ్వాన్స్ డిపాజిట్ కాదు కాబట్టి దానికి ఎటువంటి RBI అనుమతి ఉండదు, అవసరం కూడా లేదు. మార్కెట్ లో ఉన్న అన్ని బంగారం కంపెనీలు, షాపులు ఇదే విధంగా అడ్వాన్స్ తీసుకుంటాయి. వారు కొనుగోలు చేసినప్పుడు మిగిలిన మొత్తం తీసుకొని బంగారం 3% జీఎస్టీ తో బిల్ తో సహా ఇవ్వడం జరుగుతుంది. అలా ఎవరైనా కొనుగోలు చేసినప్పుడు నగలు ఇవ్వకపోతే అది చట్టరీత్యా నేరం అవుతుంది తప్ప అడ్వాన్స్ తీసుకోవడం నేరం కాదు. గమనించగలరు’’
ఇదీ ‘సిరిగోల్డ్’ సంస్థ ఛైర్మెన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ కూసంపూడి రవీంద్ర వివరణ.
‘గోల్డ్ పర్చేజ్ స్కీం పేరుతో మీరు జనం నుంచి అడ్వాన్సుగా వసూల్ చేస్తున్న రూ. 15,000 డిపాజిట్ల సేకరణకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఉందా? ఉంటే కాస్త దాని కాపీని పంపగలరు’
అని ‘సమీక్ష’ న్యూస్ ప్రశ్నించినపుడు ఆయన వాట్సాప్ ద్వారా పంపిన వివరణలోని ఆయా అక్షరాల్లో ఎటువంటి ఎడిటింగ్ కూడా లేదు.
ఇంకా ఆయన ఫోన్ ద్వారా ఏమంటారంటే..
‘మాకు చట్టబద్దమైన లైసెన్సులు ఉన్నాయి. మేం చేస్తున్నది గొలుసుకట్టు విధానం కాదు. ప్రభుత్వం విధించిన ఫ్రేమ్ లోనే మేం వ్యాపారం చేస్తున్నాం. జీఎస్టీ పన్నులు చెల్లిస్తున్నాం. గోల్డ్ పర్చేజ్ కింద కస్టమర్ నుంచి అడ్వాన్స్ తీసుకునే హక్కు మాకుంది. ఇండియాలో ఇచ్చే అన్ని అనుమతులు మాకు ఉన్నాయి. జువెల్లరీ కొనుగోళ్లలో అడ్వాన్సులు స్వీకరించడం అనుమతితో కూడిందే. షాపుకైనా, కంపెనీకైనా రిజిస్ట్రేషన్ విధానం ఒక్కటే. గోల్డ్ పర్చేజ్ కింద కస్టమర్లు రెఫర్ చేస్తే వారికి రెఫరల్ బోనస్ లు ఇస్తాం’ అని కూసంపూడి రవీంద్ర పేర్కొంటున్నారు.

అన్ని బంగారం షాపుల్లాగే తాము కూడా పర్చేజ్ అడ్వాన్సులు స్వీకరిస్తున్నట్లు ఆయన అంగీకరిస్తున్నారు. అయితే మిగతా బంగారం షాపులు ఫిజికల్ గా ఉన్నాయి కదా? మీకు షాపు లేదు కదా? అని ప్రశ్నిస్తే మాత్రం షాపు ఉన్నా లేకున్నా, వ్యాపార నిర్వహణకు తమకు అనుమతి ఉందని చెబుతున్నారు. తాము చేస్తున్న ప్రస్తుత వ్యాపారం నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే, ప్రభుత్వం, అధికారులు సూచనలు చేస్తే చట్టానికి లోబడేవిధంగా తమ వ్యాపార విధానాన్ని మార్చుకుంటామని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం.
‘సిరిగోల్డ్’ సంస్థ అంశంలో అందిన ఫిర్యాదు మేరకు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావుపైన, సంస్థ సీఎండీ, సత్తుపల్లికి చెందిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుడు కూసంపూడి రవీంద్రపై నమోదైన ఎఫ్ఐఆర్ లో ‘నమ్మక ద్రోహం, ఛీటింగ్’ సెక్షన్లను పోలీసులు ఉటంకించడం గమనార్హం. ఇదే దశలో తాము ఐదు వేల మంది సభ్యుల నుంచి రూ. 4.00 నుంచి రూ. 5.00 కోట్ల వరకు ఇప్పటికే పర్చేజింగ్ అడ్వాన్స్ కింద వసూళ్లు చేసినట్లు హైదరాబాద్ లో నమోదైన కేసులోని A1 కూసంపూడి రవీంద్ర వెల్లడిస్తున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం రూ. 15-20 కోట్ల మేరకు వసూళ్లు చేశారని ఫిర్యాదుదారుడు యాసా నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.

అయితే ఇటు తెలంగాణాలోగాని, అటు ఆంధ్రాలోగాని ఎక్కడా బంగారం షాపు లేకుండా నాలుగు నుంచి ఐదు కోట్ల మొత్తాన్ని జనం నుంచి వసూలు చేసినట్లు రవీంద్ర స్వయంగా అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో జనం నుంచి కోట్ల రూపాయలు వసూల్ చేస్తున్న అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని రియల్ సంస్థల ప్రీలాంచ్ వసూళ్ల అంశంలో ఈడీ వంటి వ్యవస్థలు కూడా రంగప్రవేశం చేసి బాధ్యులను అరెస్టు చేస్తున్నాయి. అసలు షాపే ఏర్పాటు చేయకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో గొలుసుకట్టు విధానం ద్వారా ‘సిరిగోల్డ్’ సంస్థ ముందస్తు వసూళ్లు చేస్తున్నట్లు ఆ కంపెనీ కోర్ కమిటీ సభ్యుల వీడియోలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో దాదాపు మూడేళ్లుగా ఎక్కడా షాపుల్లేకుండా వ్యాపారం పేరుతో జనం నుంచి కోట్లాది రూపాయలను వసూల్ చేసిన బీజేపీ నాయకుల అంశంలో పోలీసులు తీసుకునే చర్యలపై జనంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు బీజేపీ నాయకులపై కేసు నమోదై దాదాపు 20 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చకుండా ఎవరు అడ్డుకుంటున్నారనే అంశంపైనా ఖమ్మం జిల్లాలో రాజకీయంగా చర్చ జరుగుతుండడం విశేషం.
(కూసంపూడి నగల ‘దుకాణం’ కథ.. సశేషం)

