ఛత్తీస్ గఢ్-తెలంగాణా సరిహద్దుల్లో గల కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు ఆరుగురు నక్సలైట్లు మరణించినట్లు తాజా సమాచారం. నక్సల్స్ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు కూడా గాయపడగా, చికత్స కోసం వారిని బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు. ‘ఆపరేషన్ కర్రెగుట్ట’లో భాగంగా ఛత్తీస్ గఢ్ కు చెంది డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ తో పాటు కేంద్ర భద్రతా బలగాలు సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, కోబ్రా తదితర విభాగాలకు చెందిన పోలీసులు పెద్ద ఎత్తును కర్రెగుట్ట అడవులను చుట్టుముట్టారు.
కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నేతలు సహా దాదాపు వెయ్యి మంది నక్సలైట్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణా, ఛత్తీస్ గఢ్, ఒడిషా తదితర రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు పార్టీ కేడర్, లీడర్లు దళాల వారీగా కర్రెగుట్ట అడవుల్లో మకాం వేసినట్లు పోలీసుల వర్గాలకు సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్ గఢ్ అదనపు డీజీ వివేకానంద్ సిన్హా, సీఆర్పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్, బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ లు తెలంగాణా సరిహద్దు ప్రాంతాల్లోనే మకాం వేసి ఆపరేషన్ కర్రెగుట్టను పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు ఛత్తీస్ గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ నక్సలైట్ల ఏరివేతకు సంబంధించిన ఆపరేషన్ వివరాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కర్రెగుట్ట కారణంగా మావోయిస్టులు చక్రబంధంలో చిక్కారనే ప్రచారం జరుగుతోంది. లొంగిపోవడమో, పోరాడి చనిపోవడమో అనే పరిస్థితిని ఎదుర్కుంటున్నట్లు జాతీయ మీడియా సంస్థలు అందిస్తున్న వార్తా కథనాల సారాంశం.

వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా నక్సల్స్ రహిత భారతదేశంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే పునరుద్ఘాటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాల్లో ఆపరేషన్ కర్రెగుట్ట నక్సల్స్ ఏరివేతలో చరిత్రాత్మకంగా మారనుందా? అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఛత్తీస్ గఢ్, తెలంగాణా రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్టలో భద్రతా బలగాల గాలింపు ముగిసే నాటికి ఫలితాలు ఎలా ఉంటాయనేది ఊహకందని అంశంగా విప్లవ కార్యకలాపాల పరిశీలకులు చెబుతున్నారు.