బీఆర్ఎస్ రజతోత్సవ సభా వేదికపై గులాబీ పార్టీ వారసుడు డిక్లేర్ అయినట్టేనా? హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి కేంద్రంగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభా వేదికలోని ప్రధాన దృశ్యం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారి తీసిందనే చెప్పాలి. ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోలు మాత్రమే ఉండడం గమనార్హం. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే నడిచి, పార్టీలోనేగాక బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి హరీష్ రావు ఫొటో ఎక్కడా లేకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
అంతేకాదు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో, కటౌట్లలోనూ హరీష్ రావు ఫొటో ఎక్కడా లేదని సభకు హాజరైన బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ట్రబుల్ షూటర్ గా వ్యవహరించిన హరీష్ రావుకు ట్రబుల్ మొదలైనట్లేనా? అనే ప్రశ్నలను నెటిజన్లు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రజతోత్సవ సభలో ఏర్పాటు చేసిన తండ్రీ, కొడుకుల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.




