ఆసియా కప్ హీరో తిలక్ వర్మ తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గత రాత్రి హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయంలో తిలక్ వర్మ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. భారత జట్టును విజేతగా నిలపడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువ క్రికెటర్ తిలక్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను, కోచ్ సలాం బయాష్‌ను ముఖ్యమంత్రి రేవంత్ సత్కరించారు. తిలక్ వర్మ తన క్రికెట్ బ్యాట్‌ను సీఎం రేవంత్ రెడ్డికి బహూకరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ క్రీడా ప్రాథికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

