ఖమ్మం: ఖమ్మం నగరంలో ఈనెల 9వ తేదీన జరిగిన సంచలన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని జీవీ మాల్ పక్క సందులో మోడం ప్రమీల అనే మహిళను గుర్తు తెలియని దుండగులు గొంతుగోసి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పాల్వంచ పట్టణంలోని చాకలి బజార్ కు చెందిన బొమ్మ శ్రావణ్ కుమార్ ను, కొత్తగూడెం మండలం రామవరానికి చెందిన గడిదాసి రాజేష్ ను ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఘటనకు దారి తీసిన పరిస్థితులను ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు.
ప్రమీల హత్యకు దారితీసిన పరిణామాలు పోలీసుల కథనం ప్రకారం.. కేసులో పాల్వంచకు చెందిన ప్రధాన నిందితుడైన శ్రావణ్ ఇంట్లోనే ప్రమీల, ఆమె భర్త నరసింహారావు అద్దెకు ఉంటుండేవారు. అయితే మనస్పర్థలవల్ల ప్రమీల, నరసింహారావు దంపతులు విడిపోయారు. ఆ తర్వాత ప్రమీల భద్రాచలానికి వెళ్లి అక్కడే బాలదుర్గ టాప్ ఇన్ టౌన్ అనే బట్టల షాపులో పనిచేస్తుండేది. అప్పటి నుంచే ప్రమీలతో శ్రావణ్ కు పరిచయం ఉంది. ఈ నేపథ్యంలోనే కృష్ణ అనే వ్యక్తి నుంచి ప్రమీల శ్రావణ్ కు రూ. లక్ష అప్పు కూడా ఇప్పించింది. కానీ శ్రవణ్ అప్పు తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో ప్రమీల అతన్ని బాకీ తీర్చాలని పదే పదే అడుగుతుండేది. ఈ అంశంలో ప్రమీల, శ్రావణ్ ల మధ్య మనస్పర్ధలు పెరిగాయి. దీంతో శ్రావణ్ ప్రమీలను వేధిస్తుండేవాడు.

ఈ నేపథ్యంలోనే శ్రావణ్ కు తెలియకుండా ప్రమీల ఖమ్మం వచ్చి లిల్లీస్ క్లాత్ షోరూంలో పనిచేస్తూ, మేదరబజార్ లోని అద్దె ఇంట్లో నివాసముండేది. ప్రమీల అడ్రస్ కనుకున్న శ్రావణ్ ఖమ్మం వచ్చి ఆమెను వేధించడం ప్రారంభించాడు. ప్రమీల తనతో మాట్లాడడం లేదని, తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని, తిరిగి భర్త నరసింహారావుకు దగ్గరవుతుందని భావించిన శ్రావణ్ ఆమెను ఎలాగైనా చంచాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే శ్రావణ్ ఖమ్మం వచ్చి షాపు నుంచి ఇంటికి, ఇంటి నుంచి షాపునకు ప్రమీల వెళ్లే మార్గంలో రెక్కీ నిర్వహించాడు.
అయితే తాను ఒక్కడే ప్రమీలను చంపలేనని భావించిన శ్రావణ్, తన బావమరిది గడిదాసు రాజేష్ సహాయం కోరాడు. ప్రమీల వల్ల తన సంసారంలో గొడవలు జరుగుతున్నాయని, ప్రమీల లేకపోతే తాను, తన భార్య సంతోషంగా ఉంటానమి రాజేష్ ను ఒప్పించి హత్యకు శ్రావణ్ పథకరచన చేశాడు. హత్య పథకం అమలులో భాగంగా ఈనెల 9వ తేదీన సాయంత్రం చెట్లను నరికే పెద్ద కత్తిని, ఓ జత బట్టలను సంచిలో పెట్టుకుని సాయంత్రం ఐదున్నర గంటలకు శ్రావణ్, రాజేష్ లు బైకుపై పాల్వంచ నుంచి ఖమ్మం చేరుకున్నారు.

ఈ క్రమంలోనే ఈనెల 9వ తేదీన ప్రమీల తాను పనిచేసే లిల్లీస్ షోంరూం నుంచి బయలుదేరి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో జీవీ మాల్ పక్క సందునుంచి ఇంటికి వెడుతోంది. మార్గంలోని దర్గా సమీపంలోకి ఆమె చేరుకోగానే శ్రావణ్, రాజేష్ లు వెనుకనుంచి వచ్చి ప్రమీల ముందు బైకుని ఆపారు. శ్రావణ్ ప్రమీలను పట్టుకోగా, రాజేష్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన ప్రమీల అడ్రస్ కూడా తెలియకుండా ఉండేందుకు శ్రావణ్ ఆమె ఐడీ కార్డును, స్మార్ట్ వాచీని కూడా పట్టుకువెళ్లాడు. అనంతరం శ్రావణ్, రాజేష్ లు పారిపోతూ రక్తపు మరకల దుస్తులను, కత్తిని, ప్రమీల ఐడీ కార్డును, స్మార్ట్ వాచీని బ్యాగులో కుక్కి మార్గమధ్యంలోని చెట్ల పొదల్లో దాచారు.
ఖమ్మం నగరంలో తీవ్ర కలకలం రేపిన ప్రమీల హత్యలో నిందితులైన శ్రావణ్, రాజేష్ లు అనూహ్యంగా ఖమ్మం వన్ టౌన్ పోలీసులకు చిక్కారు. సోమవారం పగలు 12.30 గంటల ప్రాంతంలో టాటా షోరూం వద్ద వెహికిల్ చెకింగ్ చేస్తుండగా, బైకుపై ప్రయాణిస్తున్న శ్రావణ్, రాజేష్ లు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రమీలను తామే చంపినట్లు శ్రావణ్, రాజేష్ లు అంగీకరించారు. ప్రమీల హత్య కేసును ఛేదించిన ఖమ్మం వన్ టౌన్ సీఐ కరుణాకర్, ఎస్సై రామకృష్ణ, ఎస్సై అనిల్, కానిస్టేబుల్ హుస్సేన్, గౌస్ పాషాలను ఏసీపీ రమణమూర్తి అభినందించారు.

