ఆర్మీ జవాన్ ఒకరిపై దాడి చేసి కులం పేరుతో దూషించారని నమోదైన కేసులో ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మంత్రి అనుచరులద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఒక కేసులో విచారణ కోసం చింతకాని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తనపై బోనకల్ మండలానికి చెందిన ఉమ్మనేని రమేష్, లగడపాటి సాయి అనే వ్యక్తులు కులం పేరుతో దూషిస్తూ దాడి చేసినట్లు ఆర్మీ జవాన్ బూదాల మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మనోజ్ తమను అసభ్యంగా దూషించాడని రమేష్ ఇచ్చిన ఫిర్యాదుపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదంతంపై దళిత సంఘాలు ఆందోళనకు ఉద్యుక్తమవుతున్న పరిణామాల్లో పోలీసులు అత్యంత వేగంగా స్పందించి నిందితులను అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా ఘటనలో అరెస్ట్ చేసినవారి వివరాలతో వైరా ఏసీపీ రహమాన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన ప్రకటనలోని వివరాల ప్రకారం.. బూదాల మనోజ్ పై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. చింతకాని మండలం నాగులవంచలోని పెట్రోల్ బంకులో జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఫిబ్రవరి 11న చింతకాని పోలీస్ స్టేషన్ కు వచ్చిన తనపై అక్కడే ఉన్న గోవిందాపురం (ఎల్) గ్రామానికి చెందిన ఉమ్మనేని రమేష్, చింతకానికి చెందిన లగడపాటి సాయి అనే వ్యక్తులు స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారని బోనకల్ గ్రామానికి చెందిన బూదాల మనోజ్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఉమ్మనేని రమేష్, చింతకానికి చెందిన లగడపాటి సాయి అనే ఇద్దరు నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం చింతకాని పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారని వైరా ఏసీపీ రహమాన్ వివరించారు.

ఈవిషయమై ఏలాంటి ఆరోపణలకు తావు లేకుండా పూర్తి నిష్పక్షపాతంగా విచారణ కొనసాగుతుందని ఏసీపీ పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ రహమాన్ హెచ్చరించారు.

