Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

తెలంగాణా ఆర్థిక స్థితి: ఐపీనా? క్రెడిటర్ ఐపీనా??

ఆర్థికంగా ‘దివాళా’ పిటిషన్ల దాఖలు ప్రామాణికంలో రెండు కోణాలు. వ్యాపారం పేరుతోనో, మరే ఇతర కార్యకలాపాలకో అప్పులు చేసి నష్టాలు వచ్చాయని పేర్కొంటూ, రుణదాతలను ప్రతివాదులుగా చేరుస్తూ రుణ గ్రహీత కోర్టులో ‘దివాళా పిటిషన్’ దాఖలు చేయడం ఓ కోణం. తనకు నష్టాలు వచ్చాయని, అప్పులిచ్చినవారికి దమ్మిడీ ఇచ్చే పరిస్థితుల్లో లేనని రుణ గ్రహీతలు కోర్టులను ఆశ్రయిస్తుంటారు. దీన్నే ఐపీ (Insolvency Petition) అని కూడా క్లుప్తంగా వ్యవహరిస్తుంటారు. రుణ గ్రహీత సమర్పించిన పత్రాలను పరిశీలించిన తర్వాత దాఖలైన దివాళా పిటిషన్ ను అనుమతించాలా? తిరస్కరించాలా? అనేది న్యాయస్థానం నిర్ణయిస్తుంది.

ఇక రెండో కోణం ఏమిటంటే.. ఫలానా వ్యక్తి తన వద్ద అప్పు చేశాడని, తనకు అప్పు చెల్లించడం లేదని, అతన్ని దివాళా దారునిగా ప్రకటించాలని రుణదాతలెవరైనా రుణ గ్రహీతపై కోర్టును ఆశ్రయించడం. రుణ గ్రహీత ఆస్తులకన్నా అప్పులు చేశాడని రుణదాత గ్రహించినపుడు, ఆస్తులను బదలాయిస్తున్నట్లు తెలిసిన పరిస్థితుల్లో రుణదాతలు కోర్టులను ఆశ్రయిస్తారు. దీన్నే న్యాయవాద పరిభాషలో ‘క్రెడిటర్ ఐపీ’ అంటారు. ఇటువంటి పిటిషన్లలోనూ అన్ని అంశాలను పరిశీలించి న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటాయనేది తెలిసిందే. ఇప్పుడీ ‘దివాళా’ పిటిషన్ల ప్రస్తావన ఎందుకంటే..?

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు భిన్న చర్చకు తావు కల్పించాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత పాలకులు చేసిన అప్పులకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లించడానికే మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని, ప్రతీ నెల నాలుగు నుంచి నాలుగున్నర వేల కోట్ల రూపాయల లోటు ఉంటోందని సీఎం పేర్కొన్నారు. కేసీఆర్ 8.00 లక్షల కోట్ల అప్పు మిగిల్చారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఏం చేయాలో మీరే చెప్పాలని ఉద్యోగ సంఘాలను ఉద్ధేశించి సీఎం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అప్పు పుట్టడం లేదని, బ్యాంకర్లు నమ్మడం లేదని, తెలంగాణా ప్రతినిధులను దొంగలను చూసినట్లు చూస్తున్నారని తదితర కీలక వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానూ తీవ్ర చర్చకు, భిన్నాభిప్రాయాలకు తావు కల్పించాయి. ఇదే దశలో సీఎం వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో మంగళవారం కౌంటర్ ఇచ్చారు. పాలన చేతగాని అసమర్ధ, దక్షత లేని వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డిని అభివర్ణించారు. అయితే సీఎం రేవంత్ వ్యాఖ్యలకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు బాసటగా నిలిచారు. ముఖ్యమంత్రి మాటలను విపక్షం వక్రీకరిస్తోందని, ఉన్న అప్పులు చెప్పకపోతే ప్రజలను మోసం చేసినట్లవుతుందని ఖమ్మం జిల్లా పాలేరు పర్యటనలో మంత్రి పొంగులేటి అన్నారు. తమ ముఖ్యమంత్రి ముక్కుసూటిగా మాట్లాడారని, ఆయన మాటలను ఆవేదనగా భావించాలని మరో మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం మీడియాతో మాట్లాడిన చిత్రం

మొత్తంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ‘దివాళా’ దిశలోనే ఉన్నట్లు సీఎం వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఓ ప్రభుత్వాధినేత అప్పులమయమైన రాష్ట్ర పరిస్థితిని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం సంచలన చర్చకు దారి తీసిందనే చెప్పాలి. అయితే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణా లక్షలాది కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోవడానికి కారకులెవరన్నదే అసలు ప్రశ్నగా భిన్న చర్చలు సాగుతున్నాయి. ఈ ఆర్థిక ‘దివాళా’ అంశంలో వాది ఎవరు? ప్రతివాది ఎవరు? దివాళా తీసిందెవరు? తీయించిందెవరు? చివరికి బాధితులుగా మిగిలిందెవరు? అనే ప్రశ్నలు ప్రామాణికంగా ఈ చర్చలు సాగుతున్నాయి.

భిన్న కోణంలో సాగుతున్న ఓ చర్చ ప్రకారం… ఆర్థికంగా రాష్ట్రం ‘దివాళా’ పరిస్థితిని ప్రభుత్వాధినేత అయినటువంటి ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించిన పరిస్థితుల్లో పనులు చేసి బిల్లుల బకాయిల చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లు ఎవరైనా ‘క్రెడిటర్’ ఐపీకి దాఖలు చేస్తే పరిస్థితి ఏమిటనేది ఓ ఆసక్తికర ప్రశ్న. ఆచరణలో ఇది సాధ్యం కాకపోయినప్పటికీ, ఇదో తరహా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పరిపాలన చేతగాకుంటే ‘ఐపీ’ పెట్టి వెళ్లిపో.. అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్ధేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నిన్న చేసిన వ్యాఖ్యలు భిన్న కోణాల్లో వాదనలకు తావు కల్పించాయనేది నిర్వివాదాంశం.

Popular Articles