Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఊ.. అంటే ఉప రాష్ట్రపతి పదవి!

ఉప రాష్ట్రపతి పదవి మళ్ళీ తెలుగు వారి తలుపులు తడుతోంది! రెండేళ్ల పదవీ కాలం ఉండగానే జగదీప్ ధన్ ఖడ్ తో రాజీనామా చేయించి ఇప్పుడు రాజకీయ చదరంగం ఆడుతోంది బీజేపీ! మరోవైపు ధన్ ఖడ్ రాజీనామా ఉదంతం మర్యాదగా లేదని, ఉప రాష్ట్రపతిని ఇంత అవమానంగా సాగనంపుతారా? అని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది.

తెలుగు వారిలో ఇద్దరు నేతల వైపు ఉప రాష్ట్రపతి పదవీ పీఠం ఎదురు చూస్తోంది! సరే అంటే వెంటనే నారా చంద్రబాబు నాయుడును ఆ పీఠంపై కూర్చోబెడతారు. కానీ, ఆయనకు ఇష్టం లేదు. గతంలో నేను చెప్పినట్లు ఆయన చూపు రాష్ట్రపతి పీఠం వైపు మాత్రమే వుంది. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా సంతృప్తిగానే ఉన్నారు.

అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా అవకాశం వుంది. అయితే ఇక్కడ షరతులు వర్తిస్తాయి. కారణం ఆయన పార్టీకి ఒక్క ఎంపీ కూడా లేరు. కానీ, తెలంగాణలో 2029 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ తహతహలాడుతోంది. అలా రావాలంటే ఆ పార్టీకి బలమైన నేతలు కేసీఆర్ లేదా రేవంత్ రెడ్డిల అవసరం వుంది. లాక్కోవడం బీజేపీకి చిటికె వేసినంత సులభం. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ మచ్చ వెంటాడుతుందేమోనని ఆలోచనల్లో పడ్డారు.

నితీష్ కుమార్

బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తే కేసీఆర్ కు ఉప రాష్ట్రపతి లభిస్తుంది. బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తే కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనే కండిషన్ ను కేసీఆర్ పెట్టే అవకాశం కూడా వుంది. ఇదే జరిగితే అదే సమయంలో తిరిగి టీఆర్ఎస్ పార్టీ కవిత ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే అవకాశమూ వుంది.

ఓం బిర్లా

రేవంత్ రెడ్డి ఇప్పట్లో పార్టీ మారరు. తదుపరి ఎన్నికల్లో బలబలాలను బట్టి రేవంత్ ఆలోచనల్లో మార్పు ఉండే అవకాశం లేకపోలేదనే వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. ఆయన పట్ల కేంద్రంలో ఉన్న బీజేపీ మంత్రులు చాలా సానుకూలంగా ఉన్నారు. అడిగిందే తడవు గాఅప్పాయింట్మెంట్స్ ఇస్తున్నారు. కోరిందే తడవుగా వరాలు కురిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక, సీఎంగా ఆయనకు ఇవాళ 49వ ఢిల్లీ ట్రిప్. ఈ పర్యటనల్లో కాంగ్రెస్ హై కమాండ్ కన్నా ఎక్కువగా బీజేపీ మంత్రులనే కలిశారు. 2029 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం వుంది. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారు. ఒకవేళ ప్రస్తుతం జనంలో ఉన్న అసంతృప్తి ఇలాగే కొనసాగితే కావలసిన సీట్లు తగ్గుతాయి. అప్పుడే పొలిటికల్ ఈక్వేషన్స్ మారతాయి.

దగ్గుబాటి పురంధేశ్వరి

ఒకవేళ ఉప రాష్ట్రపతి తెలుగు వారు వద్దనుకుంటే బీహార్ నుంచి నితీష్ కుమార్ కు అవకాశం వుంది. ఆయన వద్దనుకుంటే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కు ఉప రాష్ట్రపతి పదవి లభించవచ్చు. ఒకవేళ ఓం బిర్లా ఆ పదవికి వెళితే స్పీకర్ గా దగ్గుబాటి పురంధేశ్వరికి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి రానున్న వారంలో రాజకీయాలు వేడెక్కనున్నాయి.

– డా. మహ్మద్ రఫీ

Popular Articles