మేడారం: వేణుస్వామి గుర్తున్నాడు కదా? ఇతను ప్రముఖ జ్యోతిష్యుడని చాలా మంది చెబుతుంటారు కదా? కానీ.. మేడారం మహాజాతరలో ఏదో జరగబోతోందంటూ ఈ వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం మాత్రం తుస్సుమనడమే అసలు విశేషం. తన నోటి నుంచి జాలువారిన పదం ప్రకారం ఈ ‘వరిజినల్’ జ్యోతిష్యుడు మేడారం జాతర గురించి డిసెంబర్ నెలాఖరులో ఓ యూ ట్యూబ్ ఛానల్ లో ఏం చెప్పాడో తెలుసా? ‘సమీక్ష’ న్యూస్ మళ్లీ ఓసారి గుర్తు చేస్తోంది.
‘‘చివరికి జ్యోతిష్యం చెప్పుకునే స్వేచ్ఛ కూడా జ్యోతిష్యుల బొందకు లేకుండా చేశారని వేణుస్వామి పేర్కొన్నాడు. తాను చెబుతున్నది సొంత కవిత్వం కాదన్నాడు. గురువు అధిపతి, కమాండర్ కేతువని సెలవిచ్చాడు. అన్నీ క్లియర్ గా ఉన్నాయన్నాడు. కేతువు అంటే భక్తి కారకుడని, మోక్ష కారకుడని నిర్వచించాడు. 2026 సంవత్సరంలో జనం ఎక్కువగా ఎక్కడ గుమిగూడి ఉంటారో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయన్నాడు. రేపు జరగబోయే పుష్కరాలు కావచ్చు, సమ్మక్క-సారక్క పండగ కావచ్చు, దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి కావచ్చు.. ఎక్కడైతే భక్తిభావం ఉంటుందో.. అక్కడ చాలా పెద్ద పెను ప్రమాదాలు, సంచలనాలు జరుగుతాయని శాస్త్రం చెబుతోందని ఈ ‘వరిజినల్’ జ్యోతిష్యుడు కమ్ పండితుడు వేణుస్వామి జ్యోతిష్యం చెప్పాడు.’’ ఇతను చెప్పాడని పేర్కొంటూ ఓ యూ ట్యూబ్ ఛానల్ అతని వీడియోను అప్ లోడ్ చేసింది.

ఇంతకీ వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం ఫలించిందా? చూశాం కదా..! దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ముగిశాయి.. మేడారంలో మహాజాతర ముగిసింది. వేలు కాదు., లక్షలు కాదు., కోట్ల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. కానీ వేణుస్వామి చెప్పినట్లు పెను ప్రమాదాలు, సంచలనాలేవీ జరగలేదు. అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే.. వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం ‘తుస్సు’మంది. కామాఖ్య టెంపుల్ లో తనను గెంటేస్తారనే విషయాన్ని తన జ్యోతిష్యం ద్వారా ముందే తెలుసుకోలేని ఇటువంటి ‘జోతిస్కులు’ చెప్పే జోస్యాన్ని నమ్మాల్సిన అవసరమే లేదు. అందుకు మేడారం జాతరకు హాజరైన భక్తుల సంఖ్యే ప్రబల నిదర్శనం.
ఈ నేపథ్యంలోనే వేణుస్వామి జ్యోతిష్యం ఫలించే ఛాన్సే లేదని ‘సమీక్ష’ న్యూస్ గత డిసెంబర్ 26వ తేదీన ప్రచురించిన వార్తా కథనం దిగువన గల లింక్ ద్వారా చదవవచ్చు..

