Top 5 This Week

Related Posts

రేవంత్ కేబినెట్ లో ‘ఖమ్మం లీడర్’ పదవికి ముప్పు!

తెలంగాణా ప్రభుత్వ మంత్రివర్గంలో నాలుగో వంతు సంఖ్య గల ఖమ్మం జిల్లాకు గల ప్రాధాన్యత కొనసాగుతుందా? తగ్గుతుందా? డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రుల్లో ఎవరైనా పదవీచ్యుతులయ్యే అవకాశం ఉందా? ఇందుకు ఏవేని పరిస్థితులు దారి తీస్తున్నాయా? ఇటువంటి అనేక సందేహాస్పద ప్రశ్నలపై జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాల్లో భిన్న చర్చ జరుగుతోంది. రేపో, మాపో జరుగుతుందని భావిస్తున్న మంత్రివర్గ విస్తరణలో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రిపై వేటు పడే అవకాశముందని రాజకీయవర్గాల్లోనే కాదు, సామాన్యుల్లోనూ ప్రచారపు చర్చ జోరందుకున్న తీరు ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రి సహా ప్రస్తుత తెలంగాణా ప్రభుత్వ మంత్రి వర్గ సభ్యుల సంఖ్య మొత్తం పన్నెండు మంది. ఇందులో నాలుగో వంతు సంఖ్యలో డిప్యూటీ సీఎం సహా ముగ్గురు ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధిర నుంచి మల్లు భట్టి విక్రమార్క, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర్ రావులు ఎమ్మెల్యేలుగా గెలుపొంది మంత్రివర్గంలో కీలక శాఖలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్నది ఖమ్మం జిల్లా నాయకులేనని, కీలక శాఖలన్నీ వారే నిర్వహిస్తున్నారని నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఇటీవల వ్యాఖ్యానించారు.

అయితే కారణాలు ఏమిటో తెలియదుగాని జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల్లో ఒకరి పదవి ఊడడం ఖాయమనే ప్రచారం మాత్రం వివిధ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వివిధ కూడళ్లలోనేకాదు, టీ స్టాళ్ల వద్ద నలుగురు గుమిగూడిన ప్రాంతాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే అటువంటి అవకాశం ఉందా? ఉంటే అందుకు గల బలమైన కారణాలేమిటి? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం సంపాదించిన ముగ్గురు నేతలూ రాజకీయంగా ఉద్దండులే. కాకపోతే ఇందులో ఇద్దరు నాయకులు మాత్రం తొలిసారి మంత్రులు కావడం గమనార్హం. ఇటువంటి నాయకుల్లో ఎవరు ఎందుకు పదవిని కోల్పోయే అవకాశముందనే అంశంపైనా భిన్న చర్చ జరుగుతోంది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మధిర నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్లు భట్టి విక్రమార్క ప్రస్తుత ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఆర్థిక, తదితర శాఖలను నిర్వహిస్తున్న భట్టి సీఎం స్థానానికి పోటీపడిన నాయకుడు కూడా. గతంలో డిప్యూటీ స్పీకర్ గా, ప్రభుత్వ చీఫ్ విప్ గా వ్యవహరించిన భట్టి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాక సీఎం సీటును ఆశించారనేది బహిరంగమే. కారణాలు ఏవైనా కావచ్చు.. అనివార్యంగా డిప్యూటీ సీఎం పదవితో భట్టి సర్దుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. సామాజికపరంగానే కాదు, కాంగ్రెస్ పార్టీతో ఆయనకు గల అనుబంధం, ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ తదితర అంశాల్లో భట్టి గట్టి పట్టు సాధించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయా పరిణామాలను, పరిస్థితులను విశ్లేషించినపుడు డిప్యూటీ సీఎం భట్టి స్థానానికి ఢోకా లేదని చెప్పవచ్చు.

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఇక రెవెన్యూ, హౌజింగ్, సమాచార, పౌర సంబంధాల వంటి కీలక శాఖలను నిర్వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదవికి ముప్పు ఏర్పడే అవకాశముందా? అనే ప్రశ్నపైనా భిన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దారి తీసిన పరిణామాల్లో పొంగులేటి పొలిటికల్ అడుగు కూడా అత్యంత కీలకమనేది నిర్వివాదాంశం. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ మంత్రివర్గంలో ఆయనకు కీలక స్థానం లభించింది. అయితే సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన సోషల్ మీడియాలో పొంగులేటిపై ప్రసారమవుతున్న వివాదాస్పద వార్తా కథనాలు సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నకు పొంగులేటి ఆర్థికంగా అండగా నిలిచారనే ప్రచారం ఉండనే ఉంది. ఈ పరిణామాల్లోనే ఇటీవలి కాలంలో తనను లక్ష్యంగా చేసుకుని తీన్మార్ మల్లన్న చేసిన పరుష పదజాలపు వ్యాఖ్యలతోపాటు అతనికి చెందిన సోషల్ మీడియా ప్రసారం చేస్తున్న వివాదాస్పద వార్తా కథనాలపై  మంత్రి పొంగులేటి స్పందించిన దాఖలాలు కూడా లేవు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి ‘చేతకాకపోతే పదవికి రాజీనామా చెయ్..’ అని కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పొంగులేటిని లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేస్తున్న తీరు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చకు దారి తీశాయి. తీన్మార్ మల్లన్నకు సన్నిహితుడైన మరో యూ ట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు సైతం మంత్రి పొంగులేటిని లక్ష్యంగా చేసుకుని వార్తా కథనాలు ప్రసారం చేస్తుండడంపైనా భిన్న వాదనలు ఉన్నాయి. మంత్రి పొంగులేటి నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖకు చెందిన తహశీల్దార్ ఆఫీసుల్లోనూ మల్లన్న ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండడం సైతం భిన్న చర్చకు దారి తీస్తోంది.

మొత్తంగా వివిధ అంశాల్లో పొంగులేటిని టార్గెట్ చేస్తూ చోటు చేసుకుంటున్న పరిణామాల్లో మంత్రివర్గ విస్తరణలో పొంగులేటి పదవిపైనా భిన్నాభిప్రాయాలకు తావు కల్పిస్తోంది. అయితే పొంగులేటిని ‘టచ్’ చేసే సాహసానికి కాంగ్రెస్ పార్టీ పూనుకుంటుందా? అనేది పెద్ద ప్రశ్న. తనకు నష్టం జరిగితే… తెగిస్తూ పొంగులేటి స్పందించే తీరు, పరిణామాలపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు తెలిసినంతగా కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా ఉండే అవకాశాలు లేవని పరిశీలకులు భావన. దీంతో ఇప్పటికిప్పుడు పొంగులేటి పదవికి వచ్చిన ముప్పేమీ లేదని కూడా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

ఇక మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పదవిపైనా జిల్లా నలు మూలలా చర్చ జరుగుతోంది. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం గల తుమ్మల ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, కేసీఆర్ మంత్రివర్గాల్లో పనిచేశారు. తాజా రాజకీయ పరిణామాల్లో రేవంత్ రెడ్డి కేబినెట్ లోనూ కొనసాగుతున్నారు. అయితే తాను నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖపై తుమ్మల సంతృప్తికరంగా లేరనే ప్రచారం ఆయన వర్గీయుల్లోనే సాగుతుండడం గమనార్హం. ముఖ్యంగా రుణమాఫీ వంటి అంశాల్లో తుమ్మల నేరుగా ‘బద్నాం’ అవుతున్నారనే అభిప్రాయాన్ని ఆయన వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే దశలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ‘కమ్మ’ సామాజికవర్గానికి చెందిన మరో వ్యక్తికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదే అనివార్యమైతే తుమ్మల పదవికి ఏదేని గండం పొంచి ఉందా? అనే ప్రశ్న కూడ తలెత్తుతోంది. కానీ సామాజికపరంగానేకాదు, రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నా తుమ్మల పదవికి పెద్దగా వచ్చిన ముప్పేమీ లేకపోవచ్చనే అభిప్రాయాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ టికెట్ అడగలేదని, మంత్రి పదవినీ కోరలేదని తుమ్మల ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం.

మొత్తంగా అన్ని అంశాలను భిన్న కోణాల్లో పరిశీలించినపుడు ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రుల పదవులకు ఇప్పటికిప్పుడు ఎటువంటి ముప్పు లేకపోవచ్చు. ఇందుకు భిన్నంగా జరిగితే మాత్రం అది రాజకీయంగా పెను సంచలనాలకు దారి తీసే అవకాశాలనూ పరిశీలకులు తోసిపుచ్చడం లేదు.

-ఎడమ సమ్మిరెడ్డి

Popular Articles