Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

‘AK-47’ ముందుకు ‘హిట్ లిస్ట్’ జర్నలిస్ట్..! తర్వాత ఏం జరిగింది!?

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్ ఎన్కౌంటర్ అనంతరం ‘గణేష్ తో గంటసేపు వాదన’ శీర్షికతో రాసిన వార్తా కథనంపై చాలా మంది స్పందిస్తూ మెసేజ్ లు పెట్టారు. గతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వహించి ప్రస్తుతం హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏసీపీ స్థాయి పోలీస్ అధికారి ఒకరు సైతం ప్రశంసిస్తూ వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపారు. ఈ నేపథ్యంలోనే ‘గణేష్ తో గంటసేపు వాదన’ కథనంలో ప్రస్తావించిన నక్సల్స్ హిట్ లిస్టులో గల ఓ జర్నలిస్ట్ ప్రాణాన్ని రక్షించిన తీరును సైతం మరో కథనంగా రాయాలని పలువురు కోరారు. ఇద్దరు నక్సల్స్ నేతల ముందు వాదన చేసిన ఓ జర్నలిస్ట్, మరో రాజకీయ నాయకుడి ప్రాణాలను కాపాడడం అత్యంత సాహసోపేతమని వచ్చిన ప్రశంసల కోసం కాకపోయినా, పరిధి దాటి వ్యవహరించే కొందరు జర్నలిస్టులు ప్రాణాంతక పరిస్థితిని ఎలా ఎదుర్కుంటారనే అంశాన్ని తెలియజేసే ఉద్ధేశంతో అప్పటి ఘటనను వందకు వంద శాతం కళ్లముందుంచే ప్రయత్నమిది. ఇంతకీ అన్నల తుపాకీకి టార్గెట్ మారిన ఆ జర్నలిస్ట్ ఎవరు? విప్లవోద్యమంలో తొలిసారి AK-47 తుపాకీని పట్టుకున్న ఆ నక్సల్ నాయకుడెవరు? అసలేం జరిగింది? నిజానికిది చాలా పెద్ద చరిత్ర.. క్లుప్తంగానే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక అసలు విషయంలోకి వెడదాం..

ములుగు నియోజకవర్గం.. ఏటూరునాగారం దండకారణ్యం.. పీపుల్స్ వార్ సంస్థ ప్రకటించిన గెరిల్లా జోన్ ఏరియా.. 1988-91వ సంవత్సరాలు .. ఓవైపు పీపుల్స్ వార్ (ఇప్పటి మావోయిస్టు పార్టీ), ఇంకోవైపు ఫణిబాగ్చి గ్రూపు, మరోవైపు రామచంద్రన్ వర్గం.. నాలుగోవైపు సీపీయూఎస్ఐ నక్సల్ సంస్థ..ఇలా చెప్పుకుంటూ పోతే సకల విప్లవ గ్రూపుల ఉద్యమాలకు, పోరాటాలకు కేంద్రంగా యావత్ ములుగు ప్రాంత అడవులు. ఈ నియోజకవర్గం పరిధిలోని ఏటూరునాగారం, గోవిందరావుపేట కేంద్రాల్లో విలేకరిగిరి అంటే కత్తిమీద సామువంటి రోజులవి. ఏ నక్సల్ గ్రూపు గురించి రెండక్షరాలు ఎక్కువ రాసినా, మరో సంస్థకు ఆగ్రహం కలిగించిన ఘటనలు అనేకం. ముఖ్యంగా ఫణిబాగ్చి నాయకత్వంలోని ప్రతిఘటన, రామచంద్రన్ గ్రూపునకు చెందిన నక్సల్ గ్రూపుల మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమనే పరిస్థితులు. ఈ రెండు సంస్థల వర్గపోరాటంలో జరిగిన పరస్పర కాల్పుల్లో చనిపోయిన ఆయా సంస్థల నాయకులు, కార్యకర్తల సంఖ్య చాలా పెద్దదే. వాస్తవానికి ఈ రెండు గ్రూపులు అంతకు ముందు చండ్రపూల్లారెడ్డి గ్రూపు సంస్థ మాత్రమే.. చీలిక తర్వాత ఇలా గ్రూపులుగా పేర్లు మారాయి.

ఈ పరిణామాల్లోనే ప్రతిఘటన గ్రూపు రాష్ట్ర కార్యదర్శి సామ అంతిరెడ్డి అలియాస్ సత్తెన్న భార్య పూలక్క ములుగు మండలం జగ్గన్నపేట సమీపంలోని పెద్దపులి గుట్ట వద్ద 1988 నవంబర్ 20వ తేదీన జరిగిన ఎన్కౌంటర్ మృతి చెందారు. పూలక్క ఎన్కౌంటర్ ప్రతిఘటన గ్రూపునకు భారీనష్టం. ఎందుకంటే ఆమె లీగల్ కార్యకర్త. రైతుకూలీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు. ప్రతిఘటన పార్టీ లీగల్ యాక్టివిటీల్లో పూలక్క చురుకైన పాత్రను పోషించేవారు. ఈ ఘటనతో ప్రతిఘటన గ్రూపు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పెద్దపులి గుట్టపై ప్రజాసంఘాలతో పార్టీ ప్లీనరీ నిర్వహిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న సమయంలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో పూలక్క చనిపోవడంపై ప్రతిఘటన పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఇదే ఘటనలో ప్రతిఘటన కీలక నేత సత్తెన్న తృటిలో తప్పించుకున్నారు. దీంతో ‘ఎన్కౌంటర్’పై పార్టీ పోస్టుమార్గానికి దిగింది.

చివరికి గోవిందరావుపేటలో పనిచేస్తున్న ఉదయం పత్రిక విలేకరి శ్రీహరిని, ఈనాడు విలేకరి కృష్ణారావును ప్రతిఘటన పార్టీ ‘ఇన్ఫార్మర్లు’గా ప్రకటించింది. పోస్టర్లు వేసింది. మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించింది. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తమదైన పరిభాషలో చెప్పింది. అప్పట్లో ములుగు ఏఎస్పీగా పనిచేసిన ఓ ఐపీఎస్ అధికారితో సామాజికంగానేగాక, ఇతరత్రా సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుని ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి సత్తెన్న ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీసేందుకు, పార్టీ కేడర్ ను అతలాకుతలాం చేసేందుకు ఈ ఇద్దరు విలేకరులు సదరు ఏఎస్పీతో కలిసి కుట్ర పన్నారనేది ప్రధాన ఆరోపణ. మొత్తంగా పూలక్క ఎన్కౌంటర్ కు ఆ ఇద్దరు విలేకరులే కారకులని ఆరోపణలు చేస్తూ వారిని ప్రతిఘటన గ్రూపు తమ ‘హిట్ లిస్ట్’లోకి చేర్చింది. గోవిందరావుపేట కేంద్రంగా ప్రతిఘటన గ్రూపును లక్ష్యంగా చేసుకుని, రామచంద్రన్ గ్రూపునకు ఓ సామాజికవర్గం సహకరిస్తోందని, అందులో ఈ ఇద్దరు విలేకరులు ముఖ్య భూమిక పోషించారనేది ప్రతిఘటన సంస్థ ప్రధాన ఆరోపణ.

తమపై ప్రతిఘటన గ్రూపు కన్నెర్ర చేసిన పరిస్థితుల్లో ఉదయం, ఈనాడు రిపోర్టర్లు శ్రీహరి, కృష్ణారావు హన్మకొండకు మకాం మార్చారు. కొంతకాలం గడిచింది.. కాలక్రమంలో ఉదయం విలేకరి శ్రీహరి గుంటూరు జిల్లా అటవీ శాఖలో ‘ఫారెస్టర్’గా నియమితులయ్యారు. కృష్ణారావు గోవిందరావుపేట నుంచి హన్మకొండకు మకాం మార్చిన తర్వాత ‘కాజీపేట’ కేంద్రానికి ఈనాడు విలేకరిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలోనే ఓరోజు.. 1991లో కావచ్చు.. ప్రతిఘటన గ్రూపు సంచలన ఘటనకు పాల్పడింది. హన్మకొండలోని రెడ్డికాలనీ నుంచి మాజీ విలేకరి, ఫారెస్టర్ శ్రీహరిని ప్రతిఘటన గ్రూపు నక్సలైట్లు సాయంత్రం వేళ కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఈ ఘటన అప్పట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. జిల్లా కేంద్రంలో ప్రతిఘటన గ్రూపు నక్సలైట్లు కిడ్నాప్ నకు పాల్పడడమే అందుకు ప్రధాన కారణం. వరంగల్ నగరంలోని జర్నలిస్టులే కాదు.. సామాన్యులు సైతం ఉలిక్కిపడ్డారు.

శ్రీహరి ప్రాణాన్ని కాపాడేందుకు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు దాసరి కృష్ణారెడ్డి వంటి ప్రముఖ పాత్రికేయులు అనేక మంది తీవ్రంగానే కృషి చేశారు. ఉదయం యాజమాన్యంతో మాట్లాడారు. శ్రీహరి ఇప్పటికీ విలేకరిగానే పనిచేస్తున్నట్లు ప్రకటించాలని ఉదయం యాజమాన్యాన్ని కోరారు. ఓ నిండు ప్రాణాన్ని కాపాడినట్లవుతుందని యాజమాన్యాన్ని కన్విన్స్ చేస్తూ అభ్యర్థించారు. మానవీయ కోణంలో ఆలోచించిన ఉదయం యాజమాన్యం శ్రీహరి తమ పత్రికలోనే పనిచేస్తున్నారని, అతనికి ఎటువంటి హాని తలపెట్టవద్దని ప్రతిఘటన నక్సల్ సంస్థను అభ్యర్థిస్తూ మరుసటి రోజు పత్రిక మెయిన్ ఎడిషన్ మొదటి పేజీలోనే ‘బాక్స్ ఐటెమ్’గా వార్తను ప్రచురించారు. జర్నలిస్టు నాయకులు కూడా శ్రీహరిని విడిచిపెట్టాలని అదే ప్రకటనలో కోరారు. కానీ ఈ అభ్యర్థన నక్సలైట్లకు వెంటనే చేరడానికి ప్రస్తుత సోషల్ మీడియా వేదికలేవీ అప్పట్లో లేవు.

గోవిందరావుపేటలో పూలక్క విగ్రహం, ఉదయం విలేకరిగా పనిచేసిన ఫారెస్టర్ శ్రీహరి

శ్రీహరిని కిడ్నాప్ చేసిన నక్సలైట్లు గోవిందరావుపేట ప్రాంతానికే తీసుకువెళ్లారు. శ్రీహరి వీపును బ్లేడ్లతో చీరి కారం పెట్టి మరీ హింసిస్తూ ‘పూలక్క’ ఎన్కౌంటర్ లో శ్రీహరి పాత్రను స్థానిక ప్రజలకు వివరిస్తూ గోవిందరావుపేట వీధుల్లో తిప్పారు. అనంతరం గోవిందరావుపేటలోనే నిర్మించిన పూలక్క స్మారక స్తూపం వద్ద అదేరాత్రి శ్రీహరిని నక్సలైట్లు అత్యంత పాశవికంగా చంపేశారు. ప్రతిఘటన గ్రూపు నక్సలైట్లు ఇంతటి ‘హింసాత్మక’ ఘటనకు పాల్పడడం ఆ పార్టీ చరిత్రలోనే చర్చనీయాంశంగా మారింది. ఆ మరుసటిరోజు పొద్దున్నే శ్రీహరి ప్రాణంకోసం ‘ఉదయం’ యాజమాన్యం చేసిన అభ్యర్థనను ప్రతిఘటన గ్రూపు నక్సల్ నేతలు చదివినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనానంతరం ప్రతిఘటన ‘హిట్ లిస్ట్’లో గల ఈనాడు విలేకరి కృష్ణారావు పరిస్థితి ఏమైందంటే..? అదే అసలు స్టోరీ.
(తరువాత కథనంలో..)

-ఎడమ సమ్మిరెడ్డి

Popular Articles