మోగ్లి (Mowgli) సినిమా చాలా మంది చూసే ఉంటారు. అడవిలో కనిపించిన అనాథ పసివాడిని తోడేళ్ల గుంపు చేరదీసి తమలో ఒకటిగా పెంచడం ఆ మూవీ కథ ఇతివృత్తం. తర్వాత నల్ల చిరుత, ఎలుగు (grizzly bear)లు బాలుడిని కంటికి రెప్పలా కాపడటం తనను తాను రక్షించుకునే నైపుణ్యాలు నేర్పించడం ఆసక్తి కలిగించేలా ఉంటాయి. రస్కిన్ బాండ్ అనే రచయిత రాసిన మోగ్లి అనే కల్పిత కథ ఆధారంగా హాలీవుడ్ తో సహా అనేక భాషలో సినిమాలు విడుదలై విజయం సాధించాయి. అలాంటిదే ఈ స్టోరీ.. కానీ ఇది యదార్థ గాథ.
మాస్కో నగరంలో వీధి శునకాల నాయకుడి (pack leader) గా వాటితో కలిసి పెరిగిన బాలుడి రియల్ లైఫ్ స్టోరీ ఇది. 1998లో పోలీసులు రక్షించే నాటికి అతని వయసు ఆరేళ్లు. ఇవాన్ మిషుకోవ్ అనే ఈ పసివాడిని శునకాల నుంచి వేరు చేసి సంరక్షణ గృహానికి చేర్చడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. పోలీసులు పట్టుకోవాలని చూసిన ప్రతిసారి 20కి పైగా జాగిలాలు వారిపై దాడికి దిగి అతన్ని దూరంగా తరలించేవి.

సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అప్పటిదాకా దేనికి లోటులేకుండా గడిపిన పౌరులు అనేక ఇక్కట్లకు గురయ్యారు. కుటుంబాలు ఛిద్రమయ్యాయి. సమాజ వ్యవస్థే కొత్త రూపం తీసుకుంది. అటువంటి సమయంలో 1992 లో మాస్కో సమీపంలోని రుటోవ్ అనే పట్టణంలో ఇవాన్ జన్మించాడు. తాగుబోతు తాత, కుటుంబాన్ని నడపలేక చీటికి మాటికి దండించే తల్లి హింస నుంచి బయటపడటానికి ఇవాన్ నాలుగేళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయాడు. కొన్నాళ్లు రుటోవ్ వీధుల్లో బేకరీల వద్ద అడుక్కుని తినేవాడు. తల్లికి దొరికిపోతాననే భయంతో సమీపంలోని మాస్కో బాట పట్టాడు. అక్కడా బేకరీల దగ్గర నిల్చుని ఎవరైనా ముక్క బ్రెడ్ ఇస్తే కడుపునింపుకునేవాడు. తను తినగా మిగిలిన ఆహారాన్ని అక్కడ కనిపించే వీథి శునకాలకు పెట్టేవాడు. అలా అవన్నీ ఇవాన్ ను నమ్మడం మొదలు పెట్టాయి. ఫుడ్ దొరకని రోజు చెత్త డబ్బాల్లోకి ఎక్కి పారేసిన ఆహారం తినేవాడు. మరికొంత సేకరించి తనని కుటుంబ సభ్యుల్లా రక్షించే శునకాలకు పెట్టేవాడు. ఇవాన్ ఎటు వెళ్లినా 20 శునకాల గుంపు అతడి చుట్టూ సెక్యూరిటీ కమెండోల్లా నడిచేవి.
మాస్కోలో శీతాకాలం మృత్యుదేవతలా నాట్యమాడుతుంది. నాలుగు నెలల పాటు విరామం లేకుండా కురిసే మంచు నగరాన్ని స్తంభింపజేస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతాయి. అటువంటి గడ్డకట్టే చలిలో శనకాల గుంపు ఇవాన్ ను దగ్గర లోని శిథిలమైన ఫ్యాక్టరీ షెడ్ లోకి తీసుకెళ్లి చుట్టూ పడుకుని వెచ్చదనాన్ని కల్పించేవి. అలా రెండేళ్లు గడిచిపోయాయి. ఇవాన్ కు తన ఇంటికంటే శునకాల అప్యాయత మంచి కుటుంబంతో ఉన్నానన్న భావన కలిగించేది.

ఈ బాలుడిని వీధుల్లో గమనించిన స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు. అతడిని తీసుకెళ్లడానికి వారు ప్రయత్నించిన ప్రతిసారి శునకాలు దాడికి దిగేవి. చివరకు రెండు మూడు వ్యాన్లలో వంద మందికి పైగా వచ్చిన పోలీసులు ఇవాన్ చుట్టూ ఉండే డాగ్స్ ప్యాక్ కు దూరంగా మాంసాహారం ఉంచి వాటిని ఏమార్చారు. క్షణాల్లో ఇవాన్ ను పట్టుకుని బలవంతంగా సంరక్షణ గృహానికి తరలించారు. తర్వాత ఒక ఫోస్టర్ (పెంపుడు) మదర్ అతడిని దత్తత తీసుకుంది.
తర్వాత మిలటరీ స్కూల్ లో చేర్పించారు. తర్వాత ఇవాన్ కొన్నాళ్లు నేవీలో పనిచేశాడు. తర్వాత తన సొంత ఊరు రుటోవ్ కు వచ్చి ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు అతనికి 33 సంవత్సరాలు. తనకు స్నేహితులుగా మెలిగిన శునకాలకు తను పెట్టిన పేర్లు జెస్సీ, గొగా, మాషా, సెవా అనే పేర్లు అతనికి ఇప్పటికీ గుర్తున్నాయి.
ఇవాన్ పై అనేక లఘు చిత్రాలు, రేడియో నాటకాలు వచ్చాయి. పుస్తకాలు కూడా ప్రచురితమయ్యాయి. తనను రక్షించిన పోలీసులకు, పెంచిన తల్లికి ఎప్పటికి రుణపడి ఉంటానని ఇవాన్ వినమ్రంగా చెబుతాడు.

✍️బి.టి. గోవిందరెడ్డి

