Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

న్యూస్ ఛానల్ ఓనర్ థర్డ్ పార్టీ మార్ట్ గేజ్ ‘తెలివిడి’ తెలుసా!?

తెలుగు మీడియాలో ప్రస్తుతం ఇదో నయా ట్రెండ్.. ఉద్యోగులకు వేతనాలు ఎగ్గొడుతూ ఏళ్ల తరబడి న్యూస్ ఛానల్ నడపొచ్చు.. తెలుసా? అదెలాగా.. అనుకుంటున్నారా? ఇందుకు చాలా సుదీర్ఘ ప్రణాళిక, దురాలోచనతో కూడా దూరాలోచన కూడా ఉండాలి. అవససరమైతే ఛానల్ లో పనిచేస్తున్న వారి ఆస్తులను, లేదా వారి స్నేహితుల ప్రాపర్టీని తెలివిగా ‘థర్డ్ పార్టీ మార్టిగేజ్’ చేయించుకునేందుకు చావు తెలివితేటలను కూడా కలిగి ఉండాలి. కల్పనతో కూడిన కబురు కాకుండా కళ్ల ముందు కనిపిస్తున్న ఓ ఛానల్ బాగోతం ఆద్యంతం ఆసక్తికరమే.

న్యూస్ ఛానల్ ఏర్పాటు ఆలోచనను అమలు చేసే ముందు ప్రముఖ, ప్రసిద్ధ, సీనియర్ జర్నలిస్టులను ఏరుకుని మరీ ఎంపిక చేసుకోవాలి. వీరి జాబితా ఎలా ఉండాలంటే జర్నలిజంలో కనీసం మూడు దశాబ్ధాల అనుభవం గల జర్నలిస్టులైతే ఇంకా బాగుంటుంది. ఇటువంటి ప్రముఖులు ఉన్నచోట ఉద్యోగం చేసేందుకు సహజంగానే చాలా మంది జర్నలిస్టులు ఉత్సాహం చూపుతారు. రిపోర్టింగ్ విభాగంలో కాస్త చేయి తిరిగిన రాతగాళ్లను, సీనియర్లను ఆకట్టుకునేందుకు అటువంటి ప్రముఖులను ఎడిటర్లుగా, ఇన్ పుట్ ఎడిటర్లుగా ఎంపిక చేసుకోవాలి. కానీ డెస్క్ పరంగా సబ్ ఎడిటర్లను ఎలా ఆకట్టుకోవాలి మరి? అందుకూ ఓ మార్గం ఉంది..

ప్రతీకాత్మక చిత్రం

ఇక్కడా అదే పద్ధతిని అనుసరించాలి. జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం గల వారిని నియమించుకుంటే బాగుంటుంది. వీళ్ల వ్యక్తిత్వమే ప్రామాణికంగా డెస్క్ పీపుల్ (సబ్ ఎడిటర్లు) చేరే అవకాశం ఉంటుంది. ఇటువంటి పేరెన్నికగల ముఖ్యులను అసిస్టెంట్ ఎడిటర్లుగా, అసోసియేట్ ఎడిటర్లుగా, ఔట్ పుట్ ఎడిటర్లుగా ఎంపిక చేసుకున్న తర్వాత వారిని వెంటేసుకుని ఏ వైఎస్ జగన్ నో, కేటీఆర్ నో కలిసి ఛానల్ ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ బిల్డప్ ఇవ్వాలి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాలక పార్టీ నేతలు అత్యంత సన్నిహితులనే ప్రచారం చేసుకోవాలి. కానీ ఛానల్ ప్రారంభించేందుకు మాత్రం అటువంటి ప్రముఖ నాయకులెవరూ రారు. ఛానల్ ఓనర్ కేరెక్టర్ ను ముందే తెలుసుకున్న రాజకీయ నాయకులు కాబట్టి ప్రముఖ నేతలెవరూ ఛానల్ ప్రారంభానికి రాకపోయి ఉండవచ్చు. అది వేరే విషయం. తమ ఛానల్ ప్రజల పక్షమని, సామాన్యుని గొంతుకకు ప్రాాధాన్యతనిస్తామని చెప్పుకోవాలి. జనం నమ్మేవిధంగా అవసరమైతే సామాన్యులతోనే ఛానల్ ప్రారంభించినట్లు చెప్పుకోవాలి.

ప్రతీకాత్మక చిత్రం

కొందరు రాజకీయ నాయకులను మరిపించేవిధంగా న్యూస్ ఛానల్ ఓనర్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ చావు తెలివితేటలను పసిగట్టలేని ప్రముఖ జర్నలిస్టులు సైతం తాము మోసపోయామని తెలుసుకునేలోపు జరగరాని నష్టం జరిగిపోతుందన్నమాట. ఆ మోసం ఏ స్థాయిలో ఉంటుందంటే.. విధుల్లో చేరినరోజు నుంచి కాకుండా, ఛానల్ ప్రారంభించిన రోజునుంచే జీతాలు ఇస్తామని చెబితే నోరెళ్లబెట్టడం మినహా మరో మార్గం ఉండదు. ఒకటి, రెండు నెలలు గడిచాక అదేమిటీ.. నా వేతనం కూడా అకౌంట్లో జమకాలేదని ఎడిటర్ హోదాలో గల జర్నలిస్ట్ సైతం ఆందోళనకు గురయ్యే స్థితి ఏర్పడుతుంది. తన ఛాంబర్ నుంచి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గదిలోకి వెళ్లిన ఎడిటర్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తారు. వేతనం రాలేదని నివేదిస్తారు. ‘అయ్య బాబోయ్.. మీకే జీతం వేయలేదా?’ అని ఎండీ తనకేమీ తెలియనట్లు నటిస్తాడు. హెచ్ఆర్ ఇంఛార్జిని, అకౌంటెంట్ ను పిలిచి మందలిస్తాడు.. కాదు కాదు.. మందలించినట్లు నటిస్తాడు. ఎడిటర్ గారికి వేతనం ఇవ్వకుంటే ఎట్లా? అని కాస్త కోపం ప్రదర్శిస్తాడు మేనేజింగ్ డైరెక్టర్.

స్వతహాగా మెతక స్వభావం గల సదరు ఎడిటర్ ఇదంతా నిజమే కాబోలు.. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని నమ్మేస్తారు. కానీ అకౌంట్లో మాత్రం వేతనం జమ కాదు. ఒకటి, రెండు, మూడు.. వరుసగా నెలలకొద్దీ కాలం గడుస్తుందే తప్ప వేతనపు రూకలు మాత్రం ఎడిటర్ అకౌంట్లోకి చేరవు. గత్యంతరం లేక ఎడిటర్ ప్రత్యామ్నాయం చూసుకుని వెళ్లిపోతారు. మరి ఉద్యోగుల సంగతి అంటారా? ఎడిటర్ జీతానికే దిక్కు లేకపోతే ఉద్యోగుల గురించి పట్టించుకునేదెవరు? వాళ్లదీ సేమ్ పొజిషన్. రెండు, మూడు నెలలే కాదు, ఆరేడు నెలల వేతనాన్ని వదులుకుని మరీ ఉద్యోగాలు వదిలేసి పారిపోతారు. ఇక జిల్లా రిపోర్టర్ల పరిస్థితి అంటారా? ప్రశ్నించినవారిని తొలగిస్తున్నట్లు ఎండీ వందిమాగధులు చెప్పొచ్చు. ఆందోళనకు దిగిన ఉద్యోగులపైకి ఎండీనే నేరుగా పోలీసులను ఉసిగొల్పవచ్చు.

ఇలా ఎడిటర్ నుంచి జిల్లా రిపోర్టర్ల వరకు వెళ్లిపోతే ఛానల్ నిర్వహణ ఎలా సాగుతుందనుకుంటున్నారా? ఇక్కడే నిరుద్యోగుల అసలు ‘బలహీనత’ను ఆ ఛానల్ ఎండీ ఒడిసిపట్టుకున్నాడు మరి. ఒకరు వెళ్లిపోతే నలుగురు లైన్లో ఉంటారు. మీడియాపై మోజుతో వచ్చేవారు ఎప్పుడూ ‘క్యూ’లొనే నిల్చుని ఉంటారు. ఇక్కడ జీతం రాకపోయినా, ఎక్కడో ఓ చోట పనిచేస్తున్నట్లు ఉంటే, జీతాలు చెల్లించే ఏదో ఒక ఛానల్ లో ఉద్యోగం రాకపోతుందా? అనేది కొందరి నమ్మకం. ఒక నెల కాకపోతే మరో నెలయినా జీతం లభించపోతుందా? అనేది మరికొందరి గుడ్డి నమ్మకం. ఇటువంటి నమ్మకమనే జీవితపు భ్రమల్లో మూడు, నాలుగు నెలలు అప్పులతోనో, సప్పులతోనో కాలం గడిచిపోతుంది. కానీ జీతం మాత్రం రాదు. ఇంకేముంది అనివార్యంగా మరో సంస్థలో ఉద్యోగం వెతుక్కోవడమే. మళ్లీ క్యూలో చాలా మందే ఉన్నారు. ఛానల్ నిర్వహణ సదరు ఎండీ కమ్ ఓనర్ కు ఇలా ‘ఛైన్ సిస్టమ్’లా నిరుద్యోగుల ఆశలతో.. అలా సాగుతోంది ఇప్పటికీ.

ప్రతీకాత్మక చిత్రం

ఇవన్నీ ఒక ఎత్తయితే ‘థర్ట్ పార్టీ మార్టిగేజ్’ దందాకు పాల్పడడమే ఈ ఛానల్ నిర్వాహకుని అసలు స్పెషాలిటీ. ‘థర్ట్ పార్టీ మార్టిగేజ్’ అంటే ఏమిటీ.. అని ఆశ్చర్యపోకండి. ఛానల్ ఎండీ కమ్ ఓనర్ జిల్లాల్లో రిపోర్టింగ్ చేేసే ప్రతినిధికి ఫోన్ చేస్తాడు. ‘ఫ్రీగా ఉన్నారా? బిజీగా ఉన్నారా?’ అంటూ బహువచనంతో సంబోధిస్తూ మరీ కుశలోపరిగా పలకరిస్తాడు. బైకు మీద ఉన్నాను సర్.. అనగానే, ‘మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి.. ఫ్రీ కాగానే ఫోన్ చేయండి’ అంటాడు. అంతటి ఛానల్ ఎండీ పోన్ చేసి భలే గౌరవంగా మాట్లాడాడే.. ఏదో శుభవార్తే చెబుతాడు కాబోలునని ఆ జిల్లా రిపోర్టర్ ఉబ్బి తబ్బిబ్బవుతాడు. ఓ ఐదు, పది నిమిషాల తర్వాత ఎండీకి ఫోన్ చేసి ‘చెప్పండి సార్.. ఏదో ముఖ్యమైన విషయం’ అన్నారని రిపోర్టర్ వినయ, విధేయలతో కనుక్కునే ప్రయత్నం చేస్తాడు.

‘ఏమీ లేదండీ.. మన ఛానల్ ప్లేస్ మెంట్ కోసం ఫలానా డిష్ టీవీ వాళ్లను అడిగాము. ఉన్న ఫలంగా వాళ్లకు కోటి రూపాయలు కట్టాలి. మనకు బ్యాంకు లోను మంజూరైందిగానీ, ప్రాసెస్ పూర్తయ్యేవరకు కాస్త టైమ్ పడుతుంది. మీ బంధువులుగాని, స్నేహితులుగాని ఎవరైనా ‘థర్ట్ పార్టీ మార్టిగేజ్’ చేస్తారా?’ అని ఎండీ ప్రశ్నిస్తాడు. ‘థర్ట్ పార్టీ మార్టిగేజ్’ అంటే ఏమిటి సర్..? అని ప్రశ్నిస్తాడు రిపోర్టర్. (వార్తలు రాయడం మాత్రమే వచ్చిన చాలా మంది జర్నలిస్టులకు ఈ థర్ట్ పార్టీ మార్టిగేజ్ గురించి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు) ‘ఏమీ లేదండీ., కొద్ది నెలలు వాళ్ల ఆస్తులను మన సంస్థ పేరుతో బ్యాంకులో ‘మార్టిగేజ్’ చేసి లోన్ తీసుకుంటామన్నమాట, మనకు మంజూరై, ప్రాసెస్ లో గల బ్యాంక్ లోన్ డబ్బు రాగానే అప్పు తీర్చేసి మార్ట్ గేజ్ నుంచి ఆస్తిని విడిపిస్తామన్నమాట’ అంటాడు సదరు మేనేజింగ్ డైరెక్టర్.

విషయం అర్థమైనట్లే కదా? పక్కోడి ఆస్తులను బ్యాంకులో తనఖా పెట్టి భారీ ఎత్తున లోన్ తీసుకుంటాడన్నమాట. విషయాన్ని సంగ్రహించిన తర్వాత ఒక్కసారిగా నిర్ఘాంతపోవడం రిపోర్టర్ వంతు అన్నమాట. మా దోస్తులకుగాని, బంధువులకు గాని అంత భారీ మొత్తం లోన్ వచ్చే స్థితి గల ఆస్తులేమీ లేవు సర్.. అని రిపోర్టర్ జవాబు చెబుతాడు. దానికి ఛానల్ మేనేజిండ్ డైరెక్టర్ ఏమంటారో తెలుసా? అదేమిటండీ.. మొన్న నేను మీ ఊరు వచ్చినపుడు నన్ను ఓ ప్రయివేట్ గెస్ట్ హౌజ్ లో ఉంచారు కదా? దాని ఓనర్ మీకు సన్నిహితుడని చెప్పారు కదా? నాకోసం కాకపోయినా మీకోసమైనా మీ దోస్త్ ఆ మాత్రం సాయం చేయలేరా? అని ప్రశ్నిస్తాడు ఎండీ. అందుకు నిరాకరిస్తాడు రిపోర్టర్. ఇంకేముంది క్రమశిక్షణా రాహిత్యం కింద పరిగణిస్తూ అప్పటికే జీతం ఎగ్గొట్టిన ఎండీగారు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కూడా తన వందిమాగధులతో చెప్పిస్తాడు.

ఇదీ సదరు ఛానల్ నిర్వాహకుని అసలు స్వరూపం. ఇప్పుడు కనుక్కోండి ఇన్ని ‘చావు’ తెలివి తేటలు గల ఛానల్ నిర్వాహకుడు తెలుగు మీడియాలో ఎవరై ఉంటారో..?

Popular Articles