Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ఇట్లయితే మున్ముందు మంత్రి పదవి కష్టమే అక్కా!

‘ఫైళ్ళు కదలాలంటే మంత్రులకు ఎంతో కొంత ఇచ్చుకోక తప్పదు. డబ్బులు తీసుకోకుండా మంత్రులెవ్వరు ఫైళ్లపై సంతకం చేయరు’.. ఇది స్వయంగా ఒక స్కూల్ ఆవరణలో స్టూడెంట్స్ ముందు తెలంగాణ అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పిన మాట. ఇలా మాట్లాడి పిల్లలకు మంత్రి ఏం సందేశం ఇచ్చినట్లు? గతంలో కూడా హీరోయిన్ సమంత విషయంలో నోరు జారి అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో మంత్రి స్థాయిలో కోర్టు మెట్లు ఎక్కారు. నిన్న వరంగల్ లో ప్రపంచ సుందరీమణుల ముందు వచ్చీ రాని ఇంగ్లీష్ లో మాట్లాడి నవ్వుల పాలయ్యారు. ఆ వేదికపై తెలుగులో మాట్లాడి అనువాదకులను పెట్టుకున్నా హుందాగా ఉండేది. వివిధ దేశాల నుంచి వచ్చిన అందాల భామలు నవ్వుకున్నారు.

నిజానికి కొండా సురేఖది మంచి వ్యక్తిత్వం. సాయం చేయాలనే మనస్తత్వం. గుండె ధైర్యం వున్న మహిళ. అయితే, మాటల్లోనే పాపం తొందరపాటు, భోళాతనం కనిపిస్తుంటుంది. ఆమె చెప్పే మాటలన్నీ వాస్తవాలే. అందరికీ తెలిసిన విషయాలే. కానీ ప్రభుత్వంలో ఉండి పైకి భోళాగా అలా మాట్లాడే విషయాలు కావు. అసలు ఈ కాలంలో నిస్వార్ధంగా ప్రజా సేవ చేసే నేతలు ఎక్కడున్నారు? ఎవరున్నారు?? ప్రజలు ఎప్పుడైతే డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం అలవాటు చేసుకున్నారో అప్పటినుంచే రాజకీయ నేతలు కూడా డబ్బులు అక్రమంగా సంపాదించడం నేర్చుకున్నారు. ఇక్కడ ఎవరు ఎవరిని తప్పు పట్టాలి? కొండా సురేఖ మాటలను ఎవ్వరూ ఖండించలేరు. ఎందుకంటే అవి నిజాలు కాబట్టి. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వంలో అయినా అందరూ ఆమ్యామ్యాలు తీసుకున్న వారే కాబట్టి, ఖండించేంత ధైర్యం, తప్పు పట్టేంత ఆత్మ సాక్షి ఎవరికి వుంది?

కొండా సురేఖ అనుభవం లేని నేత ఏం కాదు. ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, గీసుగొండ ఎంపీపీగా, రెండుసార్లు శాయంపేట, ఒకసారి పరకాల, ఇంకో రెండు సార్లు వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకురాలు. ఆమె భర్త కొండా మురళి కూడా ఎమ్మెల్సీగా చేశారు. రాజకీయ రంగంలో ఆమె ప్రస్థానం చూస్తే చాలా వరకు డేరింగ్ స్టెప్స్ కనిపిస్తాయి. దుందుడుకుతనం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. భర్త కొండా మురళి ఆమెకు కొండంత బలం.

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సురేఖ పని చేశారు. ఆయన మరణానంతరం వై.ఎస్. జగన్ ను ముఖ్యమంత్రి చేయలేదనే కోపంతో ఏకంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. తరువాత వైఎస్అర్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత గులాబీ కండువా కప్పుకుని వరంగల్ తూర్పు నుంచి గెలిచారు. అక్కడ నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఎమ్మెల్యే గా గెలిచి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఎట్లా చూసినా మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవమే. తక్కువ అంచనా వేయడానికి లేదు. ఒక మహిళగా ఇలా అంచెలు అంచెలుగా ఎదిగి ఒక కీలక నేతగా మారడం వెనుక ఆమె శ్రమ, అంకితభావం, పట్టుదల, ప్రజలకు సేవ చేయాలనే సుగుణం ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టాయి.

కొంచెం ఆచి తూచి మాట్లాడటం, ఎక్కడ ఏ విషయం మాట్లాడాలో మాట్లాడకూడదో నేర్చుకోవడం, తొందరపాటు దుందుడుకుతనం తగ్గించుకోవడం… ఇలాంటి చిన్న మార్పులు పాటిస్తే భవిష్యత్ లో ఇంకా గొప్పగా రాణించే అవకాశం వుంది. లేదంటే మొన్న ప్రెస్ మీట్ అనంతరం, అక్కడ మైకులు ఆన్ లో ఉన్నాయని కూడా చూసుకోకుండా “మా సిస్టర్ కొడుకు బి.టెక్ చదివి వున్నాడు, ఉద్యోగం చూడండి” అని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును అడిగి వైరల్ అయినట్టు అవుతూ ఉంటే మున్ముందు కొండా సురేఖకు మంత్రి పదవి ఉండటం కూడా కష్టమే!

– డా. మహ్మద్ రఫీ

Popular Articles