Top 5 This Week

Related Posts

కీలక ప్రాజెక్టులపై సీఎం వరుస సమీక్షలు

హైదరాబాద్ మెట్రోను ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించాలని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ విస్తరణకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో మెట్రో విస్తరణపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆరా తీశారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వివరించారు. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (36.8 కి.మీ.), రాయ‌దుర్గం – కోకాపేట నియోపోలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్‌ – చాంద్రాయ‌ణ‌గుట్ట (7.5 కి.మీ.), మియాపూర్‌ – ప‌టాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ న‌గ‌ర్‌ – హ‌య‌త్‌నగర్‌ (7.1 కి.మీ.) మొత్తం కలిపి 76.4 కి.మీ.ల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శ విస్త‌ర‌ణ‌కు సంబంధించి డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచ‌ర్‌గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది.

ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ (YISU) వరకు 40 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరించేందుకు కొత్తగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్‌పేట్ వరకు పొడిగించాలని చెప్పారు. అందుకు అవసరమయ్యే అంచనాలతో డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. హెచ్ఎండీఏ (HMDA)తో పాటు ఫ్యూచర్ సిటీ డెవెలప్మెంట్ అథారిటీ (FCDA) ని ఈ రూట్ మెట్రో విస్తరణలో భాగస్వామ్యులను చేయాలని చెప్పారు.

అదేవిధంగా రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా డ్రైపోర్ట్‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) స‌మీపంలో స‌రైన ప్రాంతంలో డ్రైపోర్ట్ (Dry Port) ఉండాల‌ని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం, RRR ప‌నుల పురోగ‌తిపై ముఖ్య‌మంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో స‌మీక్షించారు.

ఇటీవ‌ల రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న అంశాల‌పై ఢిల్లీలో జ‌రిగిన తెలంగాణ‌, ఏపీ అధికారుల స‌మావేశంలో హైద‌రాబాద్‌ – విజ‌య‌వాడ గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన డీపీఆర్ తయారీకి సూత్రప్రాయ ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి ఆదేశించిన నేప‌థ్యంలో ఆ ప‌నుల‌పై దృష్టి సారించాల‌ని ముఖ్యమంత్రి సూచించారు. రీజిన‌ల్ రింగు రోడ్డు ఉత్త‌ర భాగానికి సంబంధించిన‌ భూ సేక‌ర‌ణ పూర్తి చేయాల‌ని, ద‌క్షిణ భాగం డీపీఆర్ క‌న్స‌ల్టెన్సీ నివేదిక‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాజ‌ధాని రాయ్‌పూర్‌తో అనుసంధానించేలా జాతీయ ర‌హ‌దారికి ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేసి జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థకు (NHAI ) పంపించాల‌ని సీఎం సూచించారు. హైద‌రాబాద్ నుంచి మంచిర్యాల వ‌ర‌కు కొత్త జాతీయ ర‌హ‌దారి నిర్మాణానికి సంబంధించి ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేయాల‌ని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి సంబంధించి భూ సేక‌ర‌ణ‌లో ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌పై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప‌లు చోట్ల పంట‌లు ఉన్నాయ‌ని, పంట న‌ష్ట‌ప‌రిహారం చెల్లించేందుకు NHAI అంగీక‌రించ‌డం లేద‌ని అధికారులు వివ‌రించారు.

అయితే పంట కాలం దాదాపు పూర్త‌వుతున్నందున ఆ వెంట‌నే రైతుల‌తో మాట్లాడి భూ సేక‌ర‌ణ పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించారు. భూ సేక‌ర‌ణ‌కు సంబంధించి ఏవైనా స‌మ‌స్య‌లుంటే ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడాల‌ని, సాంకేతిక‌, న్యాయ స‌మ‌స్య‌లు ఉంటే వాటి ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారికి సూచించారు. ఔట‌ర్ రింగు రోడ్డు నుంచి రీజిన‌ల్ రింగు రోడ్డు వ‌ర‌కు రేడియ‌ల్ రోడ్లు, ఆర్ఆర్ఆర్‌ నుంచి తెలంగాణ స‌రిహ‌ద్దుల వ‌ర‌కు ఉన్న ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌పైనా ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని చెప్పారు.

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాపూ ఘాట్‌ వద్ద నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్‌తో పాటు మీర్ ఆలం ట్యాంక్‌పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. మీర్ ఆలం ట్యాంక్‌పైన బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్‌లో టెండర్లు పిలవాలని చెప్పారు. ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మూసీ పునరుజ్జీవనంపై ముఖ్యమంత్రి గారు కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

మీర్ ఆలం ట్యాంక్‌పై నిర్మించే బ్రిడ్జికి సంబంధించి కన్సెల్టెన్సీలు తయారు చేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు. ‘రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించాలి. సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఉండే విధంగా డిజైన్లను ఎంచుకోవాలి. ఈ బ్రిడ్జితో పాటు మీర్ ఆలం ట్యాంక్‌లో వివిధ చోట్ల ఐలాండ్లు ఉన్న మూడు ప్రాంతాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలి. సింగపూర్‌లోని ‘గార్డెన్స్ బై ది బే’ ను తలపించేలా బర్డ్స్ పారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ మూడు ఐలాండ్లను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలి’ అని సీఎం పేర్కొన్నారు.

‘అదేవిధంగా వెడ్డింగ్ డెస్టినేషన్‌కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వంచర్ పార్క్, థీమ్ పార్క్, అంఫీ థియేటర్‌తో కూడిన డిజైన్లు ఉండాలి. బోటింగ్‌తో పాటు పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉండాలి. ట్యాంక్‌లో నీటిని శుద్ధి చేయటంతో పాటు ఐలాండ్‌ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేయాలి. పీపీపీ మోడల్లో ఈ ఐలాండ్ జోన్‌ను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేయాలి. మీర్ అలం ట్యాంక్‌లో నీటి లభ్యతను, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రతను ముందుగానే అంచనా వేసుకొని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు చూపుతో డిజైన్లు రూపొందించాలి’ అని సీఎం సూచించారు.

‘ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలజీతో పాటు పర్యావరణానికి సంబంధించి నిపుణులు, లేదా ఆ రంగంలో పేరొందిన సంస్థలతో సర్వే చేయించి ఆ మేరకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలి. మీర్ ఆలం బ్రిడ్జితో పాటు ఈ ఐలాండ్ జోన్‌ను పక్కనే ఉన్న జూ పార్కుకు అనుసంధానం చేయాలి. ఇక్కడి అభివృద్ధి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని జూ పార్కును అప్‌గ్రేడ్ చేయాలి. జూ అధికారులతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారం అప్‌గ్రేడ్ చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలి. అభివృద్ధి ప్రతిపాదనలన్నీ పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా ఉండాలి’ అని సీఎం సూచించారు. ఆయా సమీక్షా సమావేశాల్లో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Popular Articles