తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2025 ఫలితాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఎంట్రెన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 2,07,190 విద్యార్థులు హాజరు కాగా, 1,51,779 మంది (73.26%) ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 81,198 విద్యార్థులు హాజరు కాగా, 71,309 (87.82%) మంది ఉత్తీర్ణులయ్యారు.
ఎంట్రెన్స్ లో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులకు, నిర్వాహకులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. వి బాలకిష్టా రెడ్డి, ఎప్‌సెట్ 2025 చైర్మన్ ప్రొ. టి. కిషన్ కుమార్ రెడ్డి, కన్వీనర్ డా. బి. డీన్ కుమార్ తో పాటు విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

