ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణాలోని పలు జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే పలు జిల్లాల ఎస్పీలు ఏకంగా ఇసుక క్వారీలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. మరికొందరు ఎస్పీలు ఇసుక అక్రమ రవాణాను నిలువరించేందుకు తీసుకోవలసిన చర్యలపై సంబంధిత ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఓవైపు పోలీసులు, ఇంకోవైపు రవాణా శాఖ, మైనింగ్ విభాగపు అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. అదనపు డీసీపీలు నరేష్ కుమార్ , ప్రసాద్ రావులతో కలిసి మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ సాయినాధ్, భూగర్భ జల శాఖ అసిస్టెంట్ అధికారి రమేష్ ఇతర అధికారులతో మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతాల్లోనే రాయల్టీ రుసుము చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలన్నారు.

జిల్లాలోని వాగులు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల ప్రదేశాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. చెక్ పోస్టుల ద్వారా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, వాహనాలను జప్తు చేయాలన్నారు. అధికారులంతా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. మైనింగ్ అధికారులు పోలీసు శాఖ సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ఆదేశించారు.
జీరో బిల్లులు, డబుల్ ట్రిప్, అదనపు లోడ్, నకిలీ బిల్లులు, తప్పుడు వాహనంలో రవాణా, తప్పుడు గమ్యం స్దానం వంటి ఉల్లంఘనలపై, అక్రమాలపై కేసులు నమోదు చేయాలని అన్నారు. ఇటువంటి అక్రమాలకు సంబంధించి ప్రధాన నిర్వాహకుల పేర్లను తప్పకుండా బయటకు తీసుకురావాలన్నారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో కారేపల్లి- కొత్త లింగాల క్రాస్ రోడ్, ముదిగొండ -వల్లభి, బోనకల్- వత్సవాయి, మధిర టౌన్- ఆత్కూర్ క్రాస్ రోడ్, సతుపల్లి టౌన్- గంగారం రింగ్ సెంటర్లలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు సీపీ సునీల్ దత్ వివరించారు. ఆయా చెక్ పోస్టులలో మైనింగ్ స్టాఫ్ తో పాటు పోలీస్ సిబ్బంది మూడు షిఫ్టులలో 24 గంటలు పనిచేస్తాయని పోలీస్ కమిషనర్ వివరించారు.

కాగా అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ హెచ్చరించారు. మానుకోట జిల్లాలోని కొమ్ములవంచ, మంగిమడుగు తదితర ప్రాంతాల్లోని ఇసుక రాంపులను ఎస్పీ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఓ ప్రకటన విడుదల చేస్తూ ఇసుకాసురులపై కఠినంగా వ్యవహారించాలని అధికారులను అదేశించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై పోలీసు శాఖ దాడులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే పీడీపీపీ, మైనింగ్ యాక్టుల్లోని కఠిన సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాలో ప్రభుత్వం కేటాయించిన ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్లలో భద్రతా చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. ప్రభుత్య అనుమతి పొందిన వారికి మాత్రమే రాష్ట్రంలో ఇసుక తరలించేందుకు, విక్రయించేందుకు అనుమతి ఉందన్నారు. ఇతరులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్స్ అని, ఇతర పేర్లతో ఎటువంటి లావాదేవీలు జరిపినా అటువంటి వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ హెచ్చరించారు.