ప్రముఖ కాంట్రాక్టర్ గడపర్తి శ్రీనివాసరావు అనుమానాస్పద మృతి ఘటన ఇల్లెందులో శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కాంట్రాక్టర్ శ్రీనివాసరావు మరణానికి బాధ్యునిగా ఆరోపిస్తూ మృతుని కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇల్లెందు మున్సిపల్ మాజీ ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్ రావు ఇంటిపై దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారు. ఘటన జరిగిన సమయంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఇల్లెందు మున్సిపల్ మాజీ ఛైర్మెన్ తన ఇంట్లోనే ఉన్నప్పటికీ, ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో ఆయన బాధితుల దాడి నుంచి తప్పించుకోగలిగారు.

అనుమానాస్పద స్థితిలో కారులో విగత జీవుడై కనిపించిన కాంట్రాక్టర్ గడపర్తి శరీనివాసరావు భార్య రమ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కాంట్రాక్టర్ శ్రీనివాసరావు, ఇల్లెందు మున్సిపల్ మాజీ ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గడచిన ఐదేళ్లుగా కాంట్రాక్టు పనులు, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఏడాది కాలం నుంచి వీరిద్దరి మధ్య ఆర్థికపరమైన లావాదేవీల్లో తేడాలు వచ్చాయి. తనకు రావలసిన డబ్బుల గురించి శ్రీనివాసరావు దమ్మాలపాటిని అడుగుతూనే ఉన్నిరు. శ్రీనివాసరావుకు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు దాదాపు రూ.1.50 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయాన్ని ఆయన తన భార్య రమతో చెప్పారు. దమ్మాలపాటి కూతురు డాక్టర్ చదువుకోసమేగాక, అతని ఫార్చూనర్ కారు కొనుగోలుకు సైతం శ్రీనివాసరావు డబ్బు ఇచ్చాడు.

ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య నెలకొన్న అర్థిక వివాదానికి సంబంధించి పంచాయతీ ద్వారా పరిష్కరించుకునేందుకు శ్రీనివాసరావు శుక్రవారం ఖమ్మం వెళ్లారు. కానీ తిరిగి ఆయన తన స్వగ్రామమైన కారేపల్లి మండలం మొట్లగూడెంలోని ఇంటికి చేరుకోలేదు. కానీ శనివారం ఉదయం గ్రామ సమీపంలోని చేను వద్ద తన కారులో చనిపోయి ఉన్నట్లు గ్రామస్తులు శ్రీనివాసరావు భార్య రమకు సమాచారం అందించారు. ఖమ్మంలో పంచాయితీ సందర్భంగా దమ్మాలపాటి ప్రసాద్ అనే వ్యక్తి తన భర్తపట్ల అసభ్యంగా మాట్లాడడం వల్లే అతను మనస్తాపానికి గురైనైట్లు తెలిసిందని రమ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల తన భర్త చావుకు కారణమైన దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై. అతని కుటుంబ సభ్యులపై, దమ్మాలపాటి ప్రసాద్ లపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కాంట్రాక్టర్ శ్రీనివాసరావు భార్య రమ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా చనిపోయిన కాంట్రాక్టర్ శ్రీనివాసరావు మృతదేహాన్ని తీసుకుని అతని కుటుంబీకులు, బంధువులు ఇల్లెందులోని దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆగ్రహంతో దమ్మాలపాటి నివాసంపై దాడికి దిగారు. ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉన్న ఫార్చూనర్ కారును ధ్వంసం చేశారు. ఈ సమయంలో దమ్మాలపాటి తన ఇంట్లోనే ఉన్నారు. అతని ఇంటి తలుపులు పగులగొట్టేందుకు బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఘటనలో దమ్మాలపాటి వెంకటేశ్వర్ రావుపైనేగాక, అతని సోదరుడు ప్రసాద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కారేపల్లి సీఐ తిరుపతిరెడ్డి ‘సమీక్ష’ న్యూస్ కు చెప్పారు.

