(‘సమీక్ష’ మార్క్ కథనం)
ఫొటోలో కనిపిస్తున్న తుపాకీని తీక్షణంగా చూడండి. బహుషా ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల పోలీసుల వద్ద కూడా ఈ తరహా ఆయుధాన్ని ఎక్కడా చూసి ఉండరు. ఇటు తెలంగాణాలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ పోలీసు విభాగం వద్ద కూడా ఇటువంటి తుపాకీ లేదని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. మరి ఎక్కడిదీ తుపాకీ అనుకుంటున్నారా? మావోయిస్ట్ పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) చీఫ్ బర్సే దేవా సహా పలువురు నక్సల్స్ తెలంగాణా డీజీపీ వద్ద శనివారం లొంగిపోయిన సందర్భంగా పోలీసులకు అప్పగించిన అధునాతన తుపాకీ ఇది. దీనిపేరు ‘TAVOR’ (టావర్).
ఇజ్రాయెల్ దేశపు తయారీ అయిన TAVOR అత్యంత అధునాతన ఆయుధం. 5.56 బుల్లెట్ వినియోగపు ఈ ఆయుధాన్ని CQB (క్లోజ్డ్ క్వార్టర్ బ్యాటిల్) తుపాకీగానూ వ్యవహరిస్తారు. ఒకేసారి శత్రువులు చుట్టుముట్టినపుడు ఈ ఆయుధం ఎంతో ఉపయోగకరంగా తెలుస్తోంది. ప్రధానంగా ప్రతికూల యుద్ధభూమిలో అత్యంత అనుకూల ఆయుధంగా చెబుతారు. పోలీసు వ్యవస్థలో యుద్ధబలగాలుగా పేరుగాంచిన అక్టోపస్ వద్ద కూడా ఈ తరహా ఆయుధం లేకపోవడం గమనార్హం.

అంతేకాదు ప్రధాని వంటి దేశ అత్యున్నత నాయకులకు భద్రత కల్పించే ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) వ్యవస్థలోనూ బహుషా ‘TAVOR’ రైఫిల్ ఉండకపోవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆక్టోపస్ బలగాల వద్ద అమెరికన్ మేడ్ ‘కోల్డ్’ వెపన్స్, ఎస్పీజీ బలగాలు ఎక్కువగా MP 5 తుపాకులు మాత్రమే ఉంటాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మనదేశంలోని అత్యంత పవర్ ఫుల్ భద్రతా బలగాల వద్ద కూడా లేని ‘TAVOR’ రైఫిల్ మావోయిస్ట్ బార్సే దేవా వద్ద ఉండడం చర్చనీయాంశంగా మారింది.
కాగా దేవా టీం లొంగుబాటు సందర్భంగా మొత్తం 48 తుపాకులను స్వాధీనం చేయగా, అందులో రెండు ఎల్ఎంజీ, ఒక్కొటి చొప్పున కోల్ట్, టావర్, ఎనిమిది ఏకే-47, పది ఇన్సాన్స్, ఎనిమిది ఎస్ఎల్ఆర్, నాలుగు బీజీఎల్, 11 సింగిల్ షాట్స్ ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాల్లో TAVORతోపాటు ఆక్టోపస్ బలగాలు వినియోగించే అమెరికన్ మేడ్ COLT వెపన్ కూడా ఉండడం గమనార్హం.

