Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

మంత్రి పొంగులేటి క్యాంపు ఆఫీస్ సిబ్బందికి ‘సిట్’ పిలుపు

తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకూ సరికొత్త అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లాలోనూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతోంది. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంపు ఆఫీసు సిబ్బందికీ ఈ అంశంలో కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ నుంచి పిలుపొచ్చింది. వీలు చూసుకుని విచారణకు రావాలని మంత్రి పొంగులేటి వద్ద పనిచేస్తున్న పలువురు సిబ్బందికి సిట్ అధికారుల నుంచి ఫోన్లు వచ్చాయి.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర రాజకీయాలను ఇప్పటి రెవెన్యూ మంత్రి, అప్పటి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. అప్పటి సీఎం కేసీఆర్ పై తిరుగుబాటు చేసి, కల్వకుంట్ల కుటుంబాన్ని అధికార పీఠం నుంచి గద్దె దించి ఇంటికి పంపిస్తానని, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏ ఒక్క అభ్యర్థినీ అసెంబ్లీ గేట్ తాకనివ్వనని పొంగులేటి శపథం చేశారు. ఈ నేపథ్యంలోనే తన ఫోన్ ట్యాపింగ్ కు గురవుతున్నట్లు పసిగట్టిన పొంగులేటి ముఖ్య విషయాల్లో తాను వాడే ఫోన్ ను వినియోగించేవారు కాదు.

దీంతో పొంగులేటి అనుచరుల, సిబ్బంది ఫోన్లపైనా అప్పటి ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేసినట్లు తాజాగా బహిర్గతమైంది. ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు ఆఫీసులో పనిచేసే సిబ్బందిలో ఎవరినీ వదలకుండా, చివరికి పొంగులేటికి తాగునీరు అందించే ఓ ఆఫీసు బాయ్ ఫోన్ ను కూాడా ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. మంత్రి పొంగులేటికి చెందిన ఖమ్మం క్యాంపు ఆఫీసులో ఉండే సిబ్బందితోపాటు ఆఫీసు బాయ్ కి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసుల నుంచి ఫోన్లు రావడం గమనార్హం. ‘మీ ఫోన్లు ట్యాప్ అయ్యాయి.. వీలు చూసుకుని సాక్ష్యం ఇచ్చేందుకు ఓసారి రండి’ అనే సారాంశంతో సిట్ పోలీసుల నుంచి పొంగులేటి క్యాంపు ఆఫీసు సిబ్బందికి ఫోన్లు వచ్చాయి.

కాగా ఖమ్మానికి చెందిన పలువురు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురైనట్లు తాజాగా వెల్లడైంది. ఈమేరకు ఓ ప్రముఖ పత్రికకు చెందిన బ్యూరో ఇంఛార్జిని సాక్ష్యం చెప్పేందుకు విచారణకు రావాలని సిట్ అధికారుల నుంచి నోటీసులు కూడా రావడం గమనార్హం. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకెన్ని ప్రకంపనలకు హేతువవుతుందో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా పొంగులేటి ఆఫీసు బాయ్ ఫోన్ నెంబర్ ను కూడా వదలకుండా అప్పటి ప్రభుత్వ విభాగానికి అందించిన వ్యక్తి ఎవరనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇందులో ఓ మీడియా ప్రతినిధి హస్తమున్నట్లు పొంగులేటి కార్యాలయ వర్గాలు అనుమానిస్తుండడం కొసమెరుపు.

Popular Articles