హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విచారణ ముగిసింది. బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో ఆదివారం సిట్ అధికారులు కేసీఆర్ ను నాలుగున్నర గంటలపాటు విచారించారు. ఈ సందర్బంగా అనేక ప్రశ్నలను సిట్ అధికారులకు కేసీఆర్ కు సంధించినట్లు సమాచారం. కేసీఆర్ ను సిట్ అధికారులు విచారణ జరిపిన సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ ముగిశాక రాత్రి 8.00 గంటల ప్రాంతంలో సిట్ అధికారులు కేసీఆర్ కు చెందిన నందినగర్ నివాసం నుంచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత కాసేపటికి కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లతో సమావేశమయ్యారు. సిట్ విచారణ జరిగిన తీరుపై ఆయా నేతలతో కేసీఆర్ చర్చించారు. ఆ తర్వాత తన నివాసం నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ పార్టీ నాయకులకు, కేడర్ కు అభివాదం చేశారు. బాల్కనీలోనే నిలబడి రెండు చేతులు జోడించి కేసీఆర్ నమస్కరించారు. ఆ తర్వాత తన నివాసంలోకి వెళ్లారు.

కాగా కేసీఆర్ ను సిట్ అధికారులు విచారణ చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణా భవన్ వద్ద ఆందోళనకు దిగారు. నందినగర్ నివాసం వద్దకు వెళ్లేందుకు పార్టీ కేడర్ చేసిన ప్రయత్నాలను పోలీసులు నిలువరించారు. విచారణ ముగిశాక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నందినగర్ నివాసం వద్దకు చేరుకోగా, వారందరికీ కేసీఆర్ తన నివాసపు బాల్కనీ నుంచి అభివాదం చేశారు.

