Top 5 This Week

Related Posts

90 చోరీల ‘హైటెక్ దొంగ’ అరెస్ట్

దొంగిలించిన సొత్తును శ్మశాన వాటికల్లో దాచి ఉంచే ‘హైటెక్’ దొంగను ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సత్తుపల్లి బస్టాండులో ఈనెల 10వ తేదీన కానిస్టేబుల్ నరేష్ ను కత్తితో దాడి చేసిన పారిపోయిన నిందితుడే ఈ దొంగ కావడం విశేషం. ఘటనకు సంబంధించిన వివరాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సత్తుపల్లిలో మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చితాపూర్ గ్రామానికి చెందిన తిరువీధుల సురేంద్ర (35) సాంకేతిక పరిజ్ఞానం కలిగిన దొంగ కావడం గమనార్హం. ఆఫ్‌లైన్ గూగుల్ మ్యాప్ మార్కింగ్ ద్వారా ఇతను చోరీలకు పాల్పడుతుంటాడు. తన తల్లికి కేవలం రూ. 300 విలువైన చీరను కొనుగోలు చేయడానికి తొలిసారి ఆస్తి నేరానికి పాల్పడ్డాడు. మొత్తం 90 కేసుల్లో సురేంద్ర నిందితుడు. గత నవంబర్ 25వ తేదీన బెయిలుపై జైలు నుంచి విడుదలైన తర్వాత సురేంద్ర ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 15 ఘటనల్లో చోరీకి పాల్పడ్డాడు.

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ కేసులో నేరస్థుడిగా శిక్ష అనుభవిస్తున్న సురేంద్రపై కొత్తగూడెంలో 4 కేసులు, మహబూబాబాద్‌లో 3 కేసులు, వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో 3 కేసులు. మూడు నెలల వ్యవధిలో సూర్యాపేటలో 7, నల్గొండలో 5, ఏలూరులో 5, పశ్చిమ గోదావరిలో 1 కేసు మొత్తం 43 కేసులు నమోదయ్యాయి. చోరీలకు పాల్పడిన తర్వాత ఇతను ఎక్కువగా శ్మశానాల్లోనే ఆశ్రయం పొంది, దొంగిలించిన సొత్తును అదే స్థలంలో పాతిపెడుతుంటాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం ఏడు జిల్లాల్లో 43 ఘటనల్లో సురేంద్ర చోరీలకు పాల్పడ్డాడు.

నిందితుని నుంచి స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తును పరిశీలిస్తున్న సీపీ సునీల్ దత్

ఈనెల 10వతేదీన రాత్రి 9 గంటల ప్రాంతంలో సత్తుపల్లి పోలీస్ కానిస్టేబుల్ నరేష్ కుమార్ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తూ ఓ గుర్తు తెలియని అనుమానాస్పద వ్యక్తిని ఆపారు. అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆ వ్యక్తి నరేష్ కుమార్‌ను హత్య చేయాలనే ఉద్ధేశంతో ఆరు సార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. పోలీసు కానిస్టేబుల్ అతనితో ధైర్యంగా పోరాడి, అతను అలవాటైన ఆస్తి చోరీల నేరస్థుడు తిరువీధుల సురేంద్రగా గుర్తించాడు. ఈ ఘటనానంతరం సమీపంలో ఉన్న ఇద్దరు పౌరులు కానిస్టేబుల్ నరేష్ కుమార్ ను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సత్తుపల్లి మండలం కొత్తూరువిలేజ్ వద్ద వైకుంఠధామం వద్ద సురేంద్ర ఉండగా పట్టుకున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ టి కవిత, కానిస్టేబుళ్లు ఎం. నరేష్‌కుమార్, ఎం. శ్రీనివాస్‌ లు నిందితుడు సురేందర్ ను పట్టుకుని రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో పట్టుబడిన నిందితుడు శ్మశానంలో పాతిపెట్టిన రూ. 45 లక్షల విలువైన 461 గ్రాముల బంగారం, 424 గ్రాముల వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు.

Popular Articles