విప్లవోద్యమ చరిత్రలో తాజా చర్చనీయాంశమిది. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం మావోయిస్టులకు సంసార జీవితంపై సరికొత్త ‘ఆశ’ను కల్పిస్తూ ప్రకటించిన సరికొత్త తాయిలాలపై విప్లవోద్యమ పరిశీలకుల్లోనే కాదు, సామాన్య వర్గాల్లోనూ ఆసక్తికర చర్చే జరుగుతోంది. సమ సమాజ స్థాపన కోసం జీవితాన్నే త్యాగం చేసి దశాబ్ధాలపాటు అడవుల్లోనే బతుకును ముగిస్తున్న అజ్ఞాత నక్సల్స్ ఎంతో మంది. ప్రభుత్వ పిలుపునకు స్పందించి అడవి బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసి జీవిస్తున్న నక్సలైట్లు కూడా అనేక మంది ఉన్నారు. ‘ఆపరేషన్ కగార్’ ఫలితంగా మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలే కాదు, సాధారణ దళ సభ్యులు కూడా ఇటీవల భారీ సంఖ్యలోనే ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతున్నారు.
వచ్చే మార్చి నెలాఖరుకల్లా నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే పునరుద్ఘాటిస్తూనే ఉన్నారు. ఆయుధాలు చేబూనినవారితో శాంతి చర్చల ప్రసక్తే లేదని, లొంగుబాట్లు తప్ప మరో మార్గమే లేదని కూడా కేంద్రంలోని అధికార పార్టీ నేతలు కూడా ప్రకటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఇంకా అడవుల్లో మిగిలి ఉన్న మావోయిస్టుల కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం సంసార జీవితంపై నక్సల్స్ కు ‘ఆశ’ కల్పించేవిధంగా ఉండడం గమనార్హం. ఇంతకీ ఏమిటా పథకం? ఇటువంటి ‘సంసార’ జీవితపు ఆశకు నక్సల్స్ ప్రభావితమవుతారా? అనే అంశంలోకి వెళ్లే ముందు ఓసారి ఫ్లాష్ బ్యాక్ ఘటనలను మననం చేసుకుంటే..
తాత అలియాస్ తిప్పారపు రాములు అనే నక్సల్ నేత 1990వ దశకంలో వరంగల్ మహానగరం నడిబొడ్డున ఎన్కౌంటర్ కు గురయ్యాడు. పీపుల్స్ వార్ వరంగల్ సిటీ సెక్రటరీగా పనిచేస్తున్న తాతను నియంత్రించేందుకు అప్పట్లో పోలీసులు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా ఉన్న కోదండరెడ్డిని పట్టపగలు తన అధికారిక ఛాంబర్ లోనే కాల్చి చంపిన ఘటన, అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రేమ్ చంద్ ను కూడా హన్మకొండ పట్టణం నడిబొడ్డు నుంచే కిడ్నాప్ చేసిన వంటి పలు ఉదంతాలతో తాత పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసేవాడు. అయితే హన్మకొండలోని గుడిబండల్ ప్రాంతంలో గల సుధానగర్ లో గల ఓ ఇంట్లో ఉదయం వేళనే జరిగిన భారీ ఎదురుకాల్పుల ఘటనలో ‘తాత’ మృతి చెందాడు. నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఎన్కౌంటర్ ఘటన అప్పట్లో భారీ సంచలనం. తాత షెల్టర్ తీసుకున్న ఆ ఇంట్లో గల ఓ మహిళతో అతనికి గల సన్నిహిత సంబంధాలపై భిన్న కోణాల్లో వార్తలు వచ్చాయి.

అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా నస్పూర్ కాలనీలో 1996 జూన్ 23న ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ సంస్థ సికాస (సింగరేణి కార్మిక సమాఖ్య) అగ్రనేత రమాకాంత్ అలియాస్ మాదిరెడ్డి సమ్మిరెడ్డితో జరిగిన ఎన్కౌంటర్ లో సీఐ చక్రపాణి, మరికొందరు కానిస్టేబుళ్లు తుపాకీ తూటాలకు బలయ్యారు. కాలనీలోని సింగరేణి క్వార్టర్ లో జరిగిన ఈ భీకరపోరులో రమాకాంత్ అలియాస్ సమ్మిరెడ్డి దాదాపు 36 గంటలపాటు పోలీసులతో పోరాడారు. వందలాది మంది ఇంటిని చుట్టుముట్టి గంటలకొద్దీ పోరాడినా ఫలితం లేని పరిస్థితుల్లో ఇంటి పైభాగాన రంధ్రం చేసి పెట్రోల్ పోసి నిప్పటించడంతో రమాకాంత్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలోనూ ఓ మహిళతో రమాకాంత్ కలిసి ఉండడంపై కూడా అప్పట్లో భిన్నవార్తలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.

ఇదే దశలో పీపుల్స్ వార్ (ప్రస్తుత మావోయిస్టు) పార్టీలో అత్యాచారాలు జరుగుతున్నాయని, మహిళలకు రక్షణ లేదని అప్పట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన ఒకరిద్దరు ఎస్పీలు ప్రెస్ మీట్లలోనేకాదు, పత్రికా ప్రకటనలు కూడా జారీ చేశారు. ఈ అంశంలో పోలీసు అధికారుల ప్రచార సరళి, తాత, రమాకాంత్ వంటి నక్సల్ నేతల ఎన్కౌంటర్ ఉదంతాలు సహజంగానే అప్పటి పీపుల్స్ వార్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. నాయకత్వానికి స్పందించక తప్పని పరిస్థితులను కల్పించాయి. దీంతో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా పీపుల్స్ వార్ కార్యదర్శి బాలన్న అలియాస్ గుండెబోయిన అంజయ్య ఓ ప్రకటన చేశారు. నక్సలైట్లు అంటే మానవాతీతులేమీ కారని, మాలో కొందరికి ‘బలహీనతలు’ ఉండవచ్చని, అంతమాత్రాన కొన్ని సంఘటనలను ప్రామాణికంగా తీసుకుని పార్టీలో ‘అత్యాచారాలు’ జరుగుతున్నట్లు పోలీసులు దుష్ప్రచారం చేయడం సరికాదని బాలన్న తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది గతం..
వర్తమానంలోకి వస్తే.. ఆపరేషన్ కగార్ ను కొనసాగిస్తూనే, అడవులను జల్లెడ పడుతూనే అక్కడ తిరుగుతున్న మావోయిస్టులకు ఛత్తీస్ గఢ్ సర్కార్ సరికొత్త జీవితంపై ఆశను కలిగిస్తోంది. ఇందులో భాగంగానే లొంగిపోయే నక్సలైట్లకు పునరావసం కల్పించడమే కాదు, ఇల్లు కట్టిస్తామని, పెళ్లిళ్లు కూడా చేస్తామని, ఐవీఎఫ్ పద్ధతిలో తల్లిదండ్రులయ్యే అవకాశాన్ని కల్పిస్తామని ఆ రాష్ట్ర హోం మంత్రి విజయ్ శర్మ ప్రకటించారు. ఇంతకీ ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నక్సలైట్లకు ఇటువంటి ఆశలు కల్పించడం వెనుక గల కారణాలపై అక్కడి పోలీసులు వెల్లడిస్తున్న వివరాలు జాతీయ మీడియాకు ఆసక్తికర వార్తాంశాలుగా మారడం గమనార్హం.

నక్సల్ ఉద్యమంలో పనిచేసే సందర్భంలో అక్కడ పరస్పరం ఇష్టపడినవారికి వివాహాలు జరిపిస్తుండడం బహిరంగమే. అయితే ఈ సందర్భంగా సంతానం కలిగితే ఉద్యమపరంగా ఇబ్బంది ఏర్పడుతుందని భావిస్తూ పురుషునికి వేసెక్టమీ ఆపరేషన్ చేయించే పద్ధతి కూడా ఉంది. బస్తర్ లోని కాంకేర్ జిల్లాలో 2010లో లొంగిపోయిన నక్సల్స్ లో దాదాపు అరడజన్ మంది తమ జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకునే ముందు మావోయిస్టు శిబిరాల్లోనే వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్నట్లు ఛత్తీస్ గఢ్ పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఇటువంటి 26 కేసులు తెరపైకి వచ్చాయని బస్తర్ పోలీసు అధికారులు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. వీరిలో 12 మందికి రీకనలైజేషన్ సర్జరీ విజయవంతమైదని, మిగిలిన 14 కేసుల్లో రీకనలైజేషన్ సర్జరీ చేయలేమని డాక్టర్లు పేర్కొన్నట్లు ఆ పోలీసు అధికారి చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల లొంగుబాట్లాను ప్రోత్సహించేందుకు సరికొత్త పథకాలను ప్రకటించింది. ఇందులో భాగంగానే లొంగిపోయే నక్సలైట్లకు ఇండ్లు కట్టిస్తామని, పెళ్లిళ్లు చేస్తామని, ఐవీఎప్ పద్ధతి ద్వారా తల్లిదండ్రులయ్యే అవకాశాన్ని కల్పిస్తామని సాక్షాత్తూ ఛత్తీస్ గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ ప్రకటించారు. చూడాలి ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ సరికొత్త స్కీంకు లభించే స్పందన ఎలా ఉండనుందో..!